ఇకనుండి రాహూల్ ది దూకుడు మంత్రమేనా ?

పార్టీని బలోపేతం చేసే విషయంలో రాహూల్ గాంధీకి ఇప్పటికైనా జ్ఞానోదయం అయినట్లుంది. అన్నీ రాష్ట్రాల్లో పార్టీని పరుగులు పెట్టించాలని డిసైడ్ అయ్యారట. పంజాబ్ లో అమరీందర్-సిద్ధూ మధ్య విభేదాలను పరిష్కరించిన పద్దతిలోనే రాజస్ధాన్ వ్యవహారాన్ని కూడా రాహూల్ డైరెక్టుగా డీల్ చేయబోతున్నట్లు ప్రచారం మొదలైంది. ఈనెలాఖరులో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్-కీలక నేత సచిన్ పైలెట్ తో భేటి అవ్వాలని రాహూల్ నిర్ణయించుకున్నారట. దీంతో సుదీర్ఘంగా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయనే అనుకుంటున్నారు.

నిజానికి పార్టీ వ్యవహారాలను రాహూల్ పట్టించుకుని చాలా కాలమే అయ్యింది. చాలా రాష్ట్రాల్లో సీనియర్ నేతల మధ్య పెద్ద వివాదాలే నడుస్తున్నా ఏరోజు వాటిని రాహూల్ పట్టించుకోలేదు. నేతల మధ్య విభేదాలను పట్టించుకోని ఫలితంగానే మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని చేతులార పడదోసుకున్నారు. మాజీ సీఎం కమలనాద్-జ్యోతిరాధిత్య సింథియా మధ్య వివాదాలు పెరిగిపోయి చివరకు ప్రభుత్వమే కూలిపోయింది.

ఇంతకాలం పార్టీని పట్టించుకోని యువరాజు హఠాత్తుగా ఎందుకింత ఇంట్రస్టు చూపిస్తున్నట్లు ? ఎందుకంటే దేశంలో జనాలు ఓట్లేయటానికి సిద్ధంగానే ఉన్న వేయించుకునేందుకు కాంగ్రెస్ నేతలే సిద్ధంగా లేరు. ఈ విషయం బీహార్, బెంగాల్, తమిళనాడు, కేరళ ఎన్నికల్లో రుజువైంది. అయితే ఆ ఎన్నికలను వదిలేస్తే తాజాగా యావత్ దేశంలో నరేంద్రమోడి సర్కార్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈమధ్యనే సోనియాగాంధి, రాహూల్ తో సమావేశమైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా వివరించారట.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పరిస్ధితి ఏమిటి ? కంగ్రెస్ పరిస్ధితేంటి అనే విషయాన్ని పీకే లెక్కలతో సహా వివరించారట. ఇపుడు గనుక మేల్కొనకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని పీకే స్పష్టంగా చెప్పేశారట. పైగా ఒకవైపు మోడి వ్యతిరేక పార్టీలన్నీ కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. బీహార్ లో తేజస్వీయాదవ్, బెంగాల్లో మమతబెనర్జీ లాంటి వాళ్ళు ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు.

సో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూసిన తర్వాతే తాను పార్టీలో యాక్టివ్ అవ్వాలని రాహూల్ డిసైడ్ చేశారట. ఇందులో భాగంగానే పంజాబ్ లో వివాదాలపై దృష్టిపెట్టారు. పైగా పార్టీలో వృద్ధతరాన్ని పక్కనపెట్టేసి యువకులకు పెద్దపీట వేయాలని కూడా డిసైడ్ చేశారట. ఇందులో భాగంగానే పంజాబ్, తెలంగాణా, మహారాష్ట్రాల్లో పార్టీ పగ్గాలను యువకులకు అప్పగించారు. పీకే యువమంత్రాన్ని రాహూల్ బాగానే వంటపట్టించుకున్నట్లున్నారు. రాహూల్ యాక్టివ్ అయితే పార్టీకే మంచిది కదా. చూద్దాం ఏ స్ధాయిలో యాక్టివ్ అవుతారో.