2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి స్వరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఇక్కడ తిరుగులేకుండా పోయింది. రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన పార్టీగా తెలంగాణను తెచ్చిన పార్టీగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన టీఆర్ఎస్‌ను జనాలు ఆదరిస్తూనే వస్తున్నారు.
అందుకే వరుసగా రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. దీంతో కేసీఆర్‌కు ఎదురు లేకుండా పోయింది. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు ఆయణ్ని ఉక్కిరిబిక్కిరి చేసేలాగే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ప్రత్యర్థి పార్టీలన్నీ కేసీఆర్నే లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నాయి.
2014 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ఏర్పడింది. ఓ వైపు అధికారం చేజిక్కించుకున్న తర్వాత రాష్ట్రంలోని ఇతర పార్టీలను బలహీన పర్చాలనే ఉద్దేశంతో చేరికలను కేసీఆర్ ప్రోత్సహించారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇదే అవకాశంగా భావించిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు అధికార పార్టీలో చేరిపోయారు.
మరోవైపు బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో తెలంగాణలో టీఆర్ఎస్ ఏకచ్ఛాధ్రిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ప్రశ్నించే దమ్మున్న నాయకులు ప్రతిపక్షంలో లేకపోవడం ఆ పార్టీకి కలిసొచ్చింది.
2018లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండోసారి అధికారం దక్కించుకున్న కేసీఆర్‌కు ఆ తర్వాత తలనొప్పులు మొదలయ్యాయనే టాక్ ఉంది. ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు జోరు పెంచాయి. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యాక అధికార టీఆర్ఎస్‌పై విమర్శల్లో దూకుడు పెంచారు. దుబ్బాక శాసనసభ స్థానం దక్కించుకోవడంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హవా కొనసాగించారు. ఇప్పుడికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెక్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి స్పీడు పెంచారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్ అక్కడ విజయం కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు. ఈ సమయంలోనే భూకబ్జా ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి తొలగించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ అయిన ఈటల రాజేందర్ ఓ వైపు.. దూకుడు మీదున్న రేవంత్ రెడ్డి మరోవైపు.. తెలంగాణలో కొత్తగా తన తండ్రి పేరుతో పార్టీ పెట్టిన షర్మిల ఇంకోవైపు.. ఇలా అందరూ ఒక్కసారిగా కేసీఆర్‌పై వచ్చి పడ్డారు.
ఉప ఎన్నికలో గెలవాలనే పట్టుదలతో ఉన్న ఈటల అధికార టీఆర్ఎస్‌పై కేసీఆర్‌పై విమర్శల్లో పదును పెంచారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలతో పాటు తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అస్త్రంగా రేవంత్ మలుచుకున్నారు. నిరుద్యోగ సమస్యను తలకెత్తుకున్న షర్మిల దీక్షలు చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో కేసీఆర్ తనదైన రాజకీయ చతురతో ప్రత్యర్థులకు చెక్ పెడతారా? లేదంటే ఆయనపై దెబ్బ పడుతుందా? అన్నది చూడాలి.