వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు బుక్కవటంలో మొబైల్ ఫోనే కీలకంగా మారిందా ? ఇదే అనుమానాలు పెరిగిపోతోంది. రఘురామ అరెస్టు నేపధ్యంలో ఏపి ప్రభుత్వం సుప్రింకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ ప్రకారం ప్రభుత్వంపై తిరుగుబాటు ఎంపి దుష్ప్రాచారం చేసేందుకు భారీఎత్తున డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. ఆయనపై వస్తున్న అనేక ఆరోపణలకు ఫోన్లో చాలా ఆధారాలున్నట్లు సమాచారం. ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు ఎంపి నోటికొచ్చినట్లు మాట్లాడటం, బురదచల్లేసిన విషయం తెలసిందే.
ప్రభుత్వానికి, జగన్ కు వ్యతిరేకంగా ఎంపి చేసిన ఆరోపణలు, విమర్శలు వరుసబెట్టి టీవీ 5, ఏబీఎన్+ఆంధ్రజ్యోతిలో చాలాకాలం ప్రసారమయ్యాయి. పై రెండు మీడియాల్లో అదేపనిగా ఎంపి కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇదే నేపధ్యంలో టీవీ 5 యాజమాన్యం నుండి ఎంపికి 10 లక్షల యూరోలు అంటే మన కరెన్సీలో సుమారు రు. 8.8 కోట్లు ముట్టినట్లు అఫిడవిట్లో ప్రభుత్వం ఆధారాలతో సహా చెప్పింది.
ప్రభుత్వం తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ కు ఆధారం ఏమిటంటే ఎంపి మొబైల్ ఫోనే. అందులో ఆర్ధిక లావాదేవీలతో పాటు ఎంపికి చంద్రబాబునాయుడు, లోకేష్+ జగన్ వ్యతిరేక మీడియా యాజమాన్యాలతో జరిపిన వాట్సప్, ఎస్ఎంఎస్ టెక్స్ట్ మెసేజులు కూడా దొరికినట్లు సమాచారం. ఈ ఫోన్ కోసమే తనను సీఐడీ పోలీసులు కొట్టారని ఎంపి చేసిన ఫిర్యాదు అందరికీ గుర్తుండే ఉంటుంది. తన మొబైల్లో ఇంత కీలకమైన సమాచారం ఉంది కాబట్టే ఫోన్ పోలీసులకు ఇవ్వటానికి ఎంపి కూడా ఓ పట్టాన ఇష్టపడలేదు.
మొత్తానికి మొబైల్ ఫోన్లో దొరికిన ఆధారాల ప్రకారం ఎంపి సీఐడీకి దొరికినట్లే అని అర్ధమవుతోంది. అఫిడవిట్లో చెప్పినదే కాకుండా సీఐడీ దగ్గర ఇంకా చాలా కీలకమైన సమాచారమే ఉందని సమాచారం. అవసరమైనపుడు వాటన్నింటినీ సీఐడీ బయటపెట్టడానికి సమాచారాన్ని రెడీగా ఉంచుకుందట. ఎంపి ఫోన్లోని మొత్తం సమాచారాన్ని ప్రభుత్వం కోర్టుకు ఇస్తేకానీ అందులో ఉన్న సమాచారం ఏమిటనే విషయం బయటకుపొక్కే అవకాశం లేదు. మొత్తానికి ఎంపి ఫోనే ఆధారాలతో సహా పట్టించినట్లు అర్ధమవుతోంది. చూద్దాం తాజా అఫిడవిట్ తో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో.