3 కోట్లతో మంత్రికి ఇల్లు క‌ట్టించిన ఆ అధికారి ఎవరు సోమూ

బీజేపీ ఏపీ చీఫ్‌.. సోము వీర్రాజు.. అడ్డంగా బుక్క‌య్యారు. ఆయ‌న వేసిన వ్యూహం ఆయ‌న‌కే ఇప్పుడు రివ‌ర్స్ అయింది. రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించాల‌ని అనుకున్నారో..ఏమో తెలియ‌దు కానీ.. సోము.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అయితే.. దీనికి సంబంధించి ఆయ‌న ఎలాంటి ఆదారాల‌ను చూపించ‌లేక పోయారు. దీంతో ఇప్పుడు స‌ద‌రు విమ‌ర్శ‌లు.. ఆయ‌న‌ను రాజ‌కీయంగా టార్గ‌ట్ చేయ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందంటూ.. సోము కొన్ని కీల‌క కామెంట్లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌.. ఓ కీల‌క అధికారి.. ఓ మంత్రికి ఇల్లు క‌ట్టించారని సోము సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అయితే.. దీనిపై ఆయ‌న వివ‌రాలు మాత్రం చెప్ప‌లేదు. నిజానికి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా.. సోము సంచ‌ల‌నం సృష్టిం చాల‌ని అనుకున్నారు. కానీ, ఏకంగా మంత్రిపైనే సోము ఆరోప‌ణ‌లు చేయ‌డం.. ఆయ‌న‌కు ఓ అధికారి ఇల్లు నిర్మించి ఇవ్వ‌డం.. దీనికి సంబంధించి దాదాపు 3 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టార‌ని సోము ఆరోపించ‌డం చూస్తే.. దీని వెనుక చాలా అవినీతి జ‌రిగింద‌నే వాద‌న వినిపిస్తోంది. అయితే.. సోము ఇంత చెప్పినా.. స‌ద‌రు మంత్రి, అధికారి వివ‌రాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. దీంతో సోము సెంట్రిక్‌గా రాజ‌కీయాలు ముసురుకున్నాయి.

ఇటు అధికార పార్టీ నేత‌లు.. అటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌లు కూడా సోమును టార్గెట్ చేయ‌డం గ‌మ‌నార్హం. “అయ్యా.. సోమువీర్రాజు గారు.. ఆ మంత్రి ఎవరు? ఏమా కధ! ఎంత దోపిడీ జరిగితే మూడుకోట్లతో ఇల్లు ఇచ్చారు. లేకపోతే ప్రజలు ప్రతి మంత్రిని అనుమానిస్తారు. కొందరు మంత్రులు ఆందోళనలకు గురౌతున్నారు. ఆ గుట్టు రట్టు చేయండి. చెప్పకపోతే ప్రజలు మిమ్మల్ని నమ్మరని” అని టీడీపీ నేత‌లు నిప్పులు చెరిగారు.

ఇక‌, వైసీపీ నేత‌లు కూడా సోముపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. కీల‌క ప‌ద‌విలో ఉన్న నాయ‌కుడు.. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఇంత తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డ‌మేంట‌ని.. విమ‌ర్శిస్తున్నారు. మ‌రి సోము ఏం చేయాల‌నుకున్నారో.. ఎలా ఇరుక్కుపోయారో.. అని ప‌రిశీల‌కులు పేర్కొంటుండ‌డం గ‌మ‌నార్హం.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)