తాజాగా జగన్ సర్కారు ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో అనేక సంచనాలు చోటు చేసుకున్నాయి. అనేక మంది కీలక నేతలను ఆయన ప్రస్తుతం ఉన్న పదవుల నుంచి తప్పించారు. ఇలా తప్పించిన వారికి కేబినెట్‌లో చోటు కల్పిస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం ఆయా పదువుల్లో ఉన్న వీరంతా.. జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరుంది. ఇలాంటి వారిలో కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్పంపూడి రాజా ఒకరు. గత రెండేళ్లుగా ఈయన కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యేగా ఒకవైపు కొనసాగుతూనే.. మరోవైపు కాపు కార్పొరేషన్ బాధ్యతలు చూస్తున్నారు.
అయితే.. తాజాగా జరిగిన నామినేటెడ్ పదవుల పంపకాల్లో.. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని అడపా శేషుకు ఇచ్చారు. ఈయన టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరిన నాయకుడు. గత ఎన్నికలకు ముందు టికెట్ ఆశించారు. అయితే.. అప్పట్లో టికెట్ నిరాకరించిన జగన్.. కీలక పదవిని ఇచ్చి, గుర్తింపు ఇస్తామని.. జగన్ హామీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఆయన కు తాజాగా అతిపెద్ద కార్పొరేషన్, అత్యంత కీలకమైన కార్పొరేషన్ బాధ్యతలను అప్పగించారు. ఇక, జక్కంపూడి రాజా విషయాన్ని తీసుకుంటే.. ఆయనకు మరింత కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
గత కేబినెట్ కూర్పులోనే కాపు కోటాలో రాజా తనకు మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నించారు. అయితే.. అప్పట్లో సాధ్యం కాలేదు. కాపుల కోటాలో ఇద్దరికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో రాజాను పక్కన పెట్టకుండా.. కాపు కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించారు.
ఇక, ఇప్పుడు ఆయనను తప్పించడం.. త్వరలోనే మంత్రి వర్గ కూర్పు ఉన్న నేపథ్యంలో రాజాకు కేబినెట్లో బెర్త్ ఖరారైనందునే జగన్ ఇప్పుడు పదవి నుంచి తప్పించారనే వార్తలు వస్తున్నాయి. ఇదిలావుంటే.. కాపుల తరఫున బలమైన గళం వినిపించిన నాయకుడిగా రాజాకు మంచి గుర్తింపు ఉంది.
చంద్రబాబు పాలనా హయాంలో ఆయన కాపుల హక్కుల కోసం.. రోడ్డెక్కారు. ఈ క్రమంలో జగన్ దృష్టిలో పడ్డారు. ఇప్పుడు కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని ఆయన అనుచరులు సైతం చెబుతుండడం గమనార్హం. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates