బైరెడ్డికి బంప‌ర్ ప‌ద‌వి ఇచ్చేసిన జ‌గ‌న్‌..!

byreddy

హ‌మ్మ‌య్యా ఎట్ట‌కేల‌కు క‌ర్నూలు జిల్లాకు చెందిన యువ‌నేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. బైరెడ్డికి క‌ర్నూలు జిల్లాకు చెందిన యువ‌నేతే కావ‌చ్చు. కానీ త‌న వాక్చాతుర్యం.. రాజ‌కీయ చ‌తుర‌త‌తో రాష్ట్ర వ్యాప్తంగానే పార్టీలోనూ, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ హైలెట్ అయిపోయాడు.

బైరెడ్డి ఏం చేసినా… ఏం మాట్లాడినా ఓ సంచ‌ల‌న‌మే అవుతూ వ‌చ్చింది. చిన్న వ‌య‌స్సులోనే జ‌గ‌న్ ద‌గ్గ‌ర తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న బైరెడ్డి అంటే పార్టీలోనే కొంద‌రికి ప‌డ‌లేదు. చివ‌ర‌కు ఆయ‌న్ను జిల్లా రాజ‌కీయాల్లో అగ‌ణ‌గ‌దొక్కాల‌ని కూడా కొంద‌రు చూశారు. ఇక నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌కు బైరెడ్డికి ఏ మాత్రం పొసిగేది కాదు. ప‌దే ప‌దే పంచాయితీలు… చివ‌ర‌కు ఏదోలా రాజీ చేయ‌డం ఇది కామ‌న్ అయిపోయింది.

బైరెడ్డి అంటే జ‌గ‌న్‌కు ఇష్టం… అందుకే బైరెడ్డి కేంద్రంగా ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా, ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా, ఎన్ని ఫిర్యాదులు చేసినా జ‌గ‌న్ ముందు నుంచి లైట్ తీస్కొంటూ వ‌చ్చారు. అందుకే ఓ ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న నందికొట్కూరులో ఎమ్మెల్యేగా ఆర్థ‌ర్ ఉన్నా.. అక్క‌డ పార్టీ ఇన్‌చార్జ్ బైరెడ్డే..! బైరెడ్డికి జ‌గ‌న్ పెద్ద ప‌ద‌వే ఇస్తార‌ని ముందు నుంచే అంచ‌నాలు ఉన్నాయి. బైరెడ్డి కేవ‌లం నందికొట్కూరుకు చెందిన యువ‌నేతే కాదు… రాష్ట్ర స్థాయిలో పార్టీని ప్ర‌భావితం చేసే నేత‌గా ఉన్నారు.

గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపులో బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ క్ర‌మంలోనే ఈ రోజు నామినేటెడ్ ప‌ద‌వుల పంపిణీలో జ‌గ‌న్ బైరెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చేశారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారటీ చైర్మన్‌ పదవి (శాప్‌)ని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి ఇచ్చారు. కొద్ది రోజుల నుంచే బైరెడ్డితో పాటు ఆయ‌న అనుచ‌రులు బైరెడ్డికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ‌చ్చారు. మ‌ధ్య‌లో మంత్రులు బొత్స‌, అనిల్ కుమార్ యాద‌వ్ బుజ్జ‌గింపులు కూడా చేశారు.

ఇక ఈ రోజు ఏకంగా కీల‌క‌మైన శాప్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. బైరెడ్డికి ఈ ప‌ద‌వి ఇవ్వ‌డం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యూత్ వింగ్‌లో మాంచి జోష్ వ‌చ్చింది. ఇక స్థానికంగా బైరెడ్డి అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. బైరెడ్డి 2024 ఎన్నిక‌ల్లో క‌ర్నూలు జిల్లాలో ఓ సంచ‌ల‌నం అవుతాడ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.