బెజవాడ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణుకు సీఎం జగన్.. ప్రమోషన్ ఇవ్వనున్నారా? ఆయనకు కేబినెట్‌లో బెర్త్ ఖరారవుతుందా? ఇప్పుడు ఇదే అంశంపై బెజవాడలో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఆయన ను జగన్ పక్కకు తప్పించారు.
ఈ క్రమంలో ఆయనకు మంత్రి పదవి ఖాయమని కొందరు అంటున్నారు. అయితే.. ఇప్పటికే మంత్రిగా ఉన్న వెలంపల్లి శ్రీనివాస్‌కు ఆయనకు పొసగడం లేదనే వార్తలు వస్తున్నాయని.. ఈ నేపథ్యంలో వెలంపల్లి సూచనల మేరకే ఆయనను పక్కన పెట్టారని మరో వర్గం చెబుతోంది.
దీంతో మల్లాది విష్ణు విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి చేరిన మల్లాది.. అంతకు ముందు విజయవాడ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ముఖ్యంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్గంలో బెజవాడ నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది.
విజయవాడలో చక్రం తిప్పిన మల్లాది.. వైఎస్ దగ్గర మంచి మార్కులు కూడా పొందారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ను వీడి.. ఆయన వైసీపీలో చేరారు. అది కూడా పార్టీలో చేరకముందుగానే.. ఆయన సెంట్రల్ నియోజకవర్గం టికెట్‌ను ఆశించి.. దీనిపై పక్కా హామీ తెచ్చుకున్న తర్వాతే.. ఆయన వైసీపీలోకి వచ్చారు.
నిజానికి 2019 ఎన్నికల సమయంలో సెంట్రల్ టికెట్‌ను కాపు కోటాలో తనకు కేటాయించాలని వంగవీటి రాధాడిమాండ్ చేయడం తెలిసిందే. అయితే.. మల్లాది చక్రం తిప్పడం, సాయిరెడ్డిని మచ్చిక చేసుకోవడం నేపథ్యంలో వంగవీటిని పక్కన పెట్టిమరీ ఆయనకు కేటాయించారు. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ఆయనను వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా చేశారు.
అయితే.. ఇప్పుడు జరిగిన నామినేటెడ్ పోస్టు ల భర్తీలో మల్లాదిని పక్కన పెట్టి.. ఈ పోస్టును మరో నేత సుధాకర్‌కు అప్పగించారు. దీంతో మల్లాదికి జగన్ ప్రమోషన్ ఇస్తారని.. ఆయన వర్గం అప్పుడే ప్రచారం ప్రారంభించింది. అయితే.. వెలంపల్లి వర్గం మాత్రం.. తమ నాయకుడితో నిత్యం కీచులాడుతున్న మల్లాదిని పక్కన పెట్టారని.. ఆయన ప్రభావం తగ్గిపోతుందని అంటోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates