టీటీడీపీ కొత్త అధ్య‌క్షుడిపై క్లారిటీ…!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత దీనస్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తన ఉనికిని చాటుకుంది. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు మల్కాజ్‌గిరి నుంచి పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎంపి మల్లారెడ్డి కూడా పార్టీ మారిపోయారు. చివ‌ర‌కు 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాత్రమే పార్టీకి మిగిలారు.

ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మ‌చ్చా నాగేశ్వరరావు గులాబీ గూటికి చేరిపోయారు. కాస్తోకూస్తో పార్టీకి పడుతుందని చెప్పుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లోనూ పార్టీ పూర్తిగా దిగజారిపోయింది. ఇక తెలంగాణలో టిడిపికి ఎన్ని జాకీలు వేసినా పుంజుకోద‌ని డిసైడ్ అయిన ఆ పార్టీ తాజా మాజీ అధ్యక్షులు ఎల్.రమణ సైతం కారెక్కేశారు. ఇటీవల రమణ పార్టీని వీడ‌డంతో టిడిపి నేతలు అంతా జారుకుంటున్నారు.

తెలంగాణలో పార్టీ మరి చుక్కాని లేని నావ మాదిరిగా మారడంతో… చంద్రబాబు సైతం పార్టీకి భవిష్యత్తు ఉన్నా లేకపోయినా విగ్రహం మాదిరిగా ఒక అధ్యక్షుని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులుకు టీటీడీపీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఒక‌టి రెండు రోజుల్లో ఆయ‌న ఎంపిక‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. పార్టీ
అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై కూడా క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. బీసీ నేత‌గా ఉన్న ర‌మ‌ణ పార్టీని వీడ‌డంతో చంద్ర‌బాబు ఇప్పుడు తెలంగాణ‌లో ఉన్న పొలిటిక‌ల్ ఈక్వేష‌న్ల నేప‌థ్యంలో వ‌న‌ప‌ర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికే టీటీడీపీ ప‌గ్గాలు ఇవ్వాల‌ని అనుకున్నారు.

చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిపై పార్టీ ప‌గ్గాలు స్వీక‌రించాల‌ని తీవ్రంగా ఒత్తిడి చేశార‌ట‌. అయితే వ్యక్తిగత కారణాలతో టీటీడీపీ అధ్యక్షుడి పదవిని స్వీకరించడానికి రావుల చంద్రశేఖరరెడ్డి నిరాక‌రించిన‌ట్టు తెలుస్తోంది. ఆ త‌ర్వాత బీసీ నేత అయిన అర‌వింద్ కుమార్ గౌడ్ పేరు కూడా ప్ర‌ముఖంగా ప‌రిశీల‌న‌కు వ‌చ్చింది. చివ‌ర‌కు బక్కని నర్సింహులు వైపు పార్టీ నాయకత్వం మొగ్గుచూపిన‌ట్లు సమాచారం. మ‌రి రాష్ట్ర వ్యాప్తంగా అంత ఫేమ్ లేని న‌ర్సింహులు టీటీడీపీని ఏ తీరాల‌కు చేరుస్తారో ? చూడాలి.