నేనే సీఎంగా ఉండి ఉంటే.. జ‌ల వివాదంపై కేసీఆర్‌తో..

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న జ‌ల‌వివాదాల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తొలిసారి బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేశారు. 2019 ఎన్నికలకు ముందు తనను ఓడించేందుకు కేసీఆర్, జగన్లు నీటి సమస్య పరిష్కారానికి ఎందుకు కలసి మాట్లాడుకోవట్లేదని చంద్రబాబు నిలదీశారు.

తెలంగాణ ప్రభుత్వం నీటిని పులిచింతలలో వదిలి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే.. సీఎం జగన్‌ ఎందుకు బాధ్యత తీసుకుని కేసీఆర్తో మాట్లాడట్లేదని ప్రశ్నించారు. నీటిని వృధాగా సముద్రపాలు చేసే అసమర్థ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని చంద్ర బాబు విమర్శించారు.

ఇలాంటి నీటి సమస్యే తాను సీఎంగా ఉన్నప్పుడు తలెత్తితే వెంటనే కేసీఆర్ తో మాట్లాడి పరిష్కరించామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తాను సీఎంగా ఉండి ఉంటే.. ప‌రిస్థితి వేరేగా ఉండేద‌ని.. భేష‌జాలు విడిచి పెట్టి కేసీఆర్‌తో చ‌ర్చించి ఉండేవాడిన‌ని అన్నారు.

రాష్ట్ర హక్కుల్ని కాపాడుకుంటూనే ప్రతి ఎకరాకు నీరివ్వొచ్చన్న చంద్రబాబు.. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో నీటి సమస్య ను పరిష్కరించవచ్చని తెలిపారు. తాజాగా కృష్ణాజిల్లాలోని మ‌చిలీప‌ట్నంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర కుటుబాన్ని ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్ వైఖ‌రిపై నిప్పులు చెరిగారు.

పోలవరం ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకూ వారి పక్షాన పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పరిగెత్తించిన పోలవరాన్ని పడుకోపెట్టారని ఆయన మండిపడ్డారు. పునరావాసం ఇవ్వకుండా గిరిజనుల్ని గోదావరిలో ముంచుతున్నారన్నారు. అడవిని నమ్ముకున్న గిరిజనులు కొండెక్కే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భూభాగంపై నీరుపారిస్తే ఇబ్బందులు అని తాను ముందే హెచ్చరించానని గుర్తుచేశారు.

రాయలసీమ ప్రాజెక్టులను అభివృద్ధి చేయకుండా ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కొంత వరకే పాలించగలరని.. రైతులు తిరగబడితే పారిపోతారని హెచ్చరించారు. కేసులకు తాము భయపడే పరిస్థితే లేదన్నారు. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదని.. పోలీసులు కూడా హుందాగా ప్రవర్తిస్తూ పద్ధతి ప్రకారం పని చేయాలన్నారు. కాగా, మ‌చిలీప‌ట్నంలో చంద్ర‌బాబుకు పార్టీ నేత‌ల నుంచి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.