చుట్టుముడుతున్న విమర్శలు, నిత్యం పుంఖాను పుంఖాలుగా వస్తున్న వ్యతిరేక వార్తల నేపథ్యంలో సీఎం జగన్ తన కీలక సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో సంచలన నిర్ణయం తీసుకునేదిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల హైకోర్టు.. సలహాదారుల విధులు ఏంటి? వారు రాజకీయాలు మాట్లాడొచ్చా? అంటూ.. ప్రశ్నించిన విషయం తెలిసిందే.
ఇక, అక్కడి నుంచి వైసీపీ వ్యతిరేక మీడియాలో సజ్జల టార్గెట్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న సలహాదారుల్లో సజ్జల యాక్టివ్‌గా ఉన్నారు. ప్రభుత్వంలో ఆయన షాడో సీఎం అయ్యారన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.
అంతేకాదు.. ఆయన రాజకీయంగా టీడీపీని టార్గెట్ చేస్తున్నారు.
అదే సమయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మీడియా ముఖంగా.. సమర్ధిస్తున్నారు. అయితే .. ఎస్ ఈసీ నీలం సాహ్ని విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సజ్జలకు కూడా వర్తిస్తాయంటూ.. ప్రతి పక్షాలు ఆందోళన లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎప్పటికైనా.. సజ్జలపైనా.. న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది.
కానీ, ఆయనను వదులుకునేందుకు సీఎం జగన్ సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలోనే సజ్జలను వ్యూహాత్మకంగా మండలికి పంపించి.. ఆయనను నేరుగా రాజకీయాల్లోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఇదే విషయంపై జగన్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని.. శాసన మండలిలో త్వరలోనే జరగనున్న భర్తీల్లో సజ్జలకు అవకాశం ఇవ్వడం ద్వారా.. ఆయనను మంత్రిగా తీసుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తరఫున గట్టి వాయిస్ వినిపించేందుకు ఎవరూ లేకపోవడం.. ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. మాట్లాడితే.. నోటికి ఏమొస్తుందో తెలియని నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. కానీ, ఆచి తూచి.. వివాదాస్పదం కాకుండా ఉండేలా మాట్లాడే నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు.
ఇలాంటి వారిలో సజ్జల అత్యంత విశ్వాసపాత్రుడు కావడంతో జగన్ ఆయనను వదులుకునేందుకురెడీగా లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే సజ్జలకు మరింత ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు.. విమర్శలకు, వ్యతిరేకతకు చెక్ పెడతారని అంటున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలా ? ఉంటుందో ? చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates