తెలంగాణ లో టీడీపీ పూర్తిగా పడిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ పార్టీ ప్రాబల్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో.. పార్టీకి కొత్త న్యాయకత్వం అవసరమని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే.. జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు అందించాలని కోరుకునేవారు పెరిగిపోయారు.
ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత స్వయంగా చంద్రబాబు టూర్ లోనే టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకురావాలనే డిమాండ్ వినిపించారు. చంద్రబాబు కాన్వాయ్ ముందే జై ఎన్టీఆర్ అంటూ కొందరు అభిమానులు డిమాండ్ చేశారు.
కొద్దిరోజుల క్రితం ఓ సినిమా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ ఎన్టీఆర్.. స్టేజ్ పైన మాట్లాడుతుండగానే అభిమానులు ‘‘సీఎం, సీఎం ’’ అంటూ నినాదాలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్టీఆర్.. ఆపండి బ్రదర్ అంటూ వారించే ప్రయత్నం చేశారు. కొద్దిరోజుల క్రితం కుప్పంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలోకి తీసుకురావాలంటూ ఏకంగా జెండాలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది.
ఆ ఘటన మరవకముందే తాజాగా చంద్రబాబుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ తగిలింది. బుధవారం కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్టణంలో టీడీపీ చీఫ్ పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ జెండాలను చేతబూని బాబు కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. ఈ ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం అంటూ నినాదాలు రాసి ఉండటంతో కలకలం రేగింది. కార్యకర్తలు పెద్దగా నినాదాలు చేస్తున్నా చంద్రబాబు ఎలాంటి కామెంట్లు చేయకుండా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ప్రస్తుతం జూనియర్ వ్యవహారం మరోసారి టీడీపీతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.