తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. సంగం డెయిరీ కేసులో ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన నరేంద్రకు ధైర్యం చెప్పారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన స్వగృహానికి వచ్చిన చంద్రబాబు.. పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని అభయమిచ్చారు. రాజకీయ కక్షసాధింపు కోసమే ఆయన్ను అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. సంగం డెయిరీ.. కంపెనీ చట్టంలోకి చట్టప్రకారమే వెళ్లిందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. అన్నీ రాసి పెట్టుకుంటున్నా మని.. ఎవరినీ వదిలి పెట్టబోమని.. చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. 43 వేల కోట్ల రూపాయలు దోచుకున్న జగన్కు సిగ్గు ఎగ్గు లేదని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేయని వారి పై కేసులు పెట్టి.. రాజకీయ కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ధూళిపాళ్ల నరేంద్రకు టీడీపీ పూర్తిగా అండగా ఉంటుందని, ఆయనకు ప్రజలు కూడా అండగా నిలవాలని చంద్రబాబు అన్నారు.
పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ నాయకులను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, వైసీపీ నేతల అవినీతిపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని. దీని నుంచి దృష్టి మరల్చేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని బాబు మండిపడ్డారు. వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు చాలవు. జగన్ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు. అన్నీ గుర్తు పెట్టుకుంటాం. రాజద్రోహం కేసులో ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది
అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
అచ్చెన్నతో మొదలైన అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కామెంట్ పెట్టినా అరెస్టు చేస్తున్నారని దుయ్యబట్టారు. కోర్టు తీర్పులు కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అధికార పార్టీ చేతిలో పావులుగా మారొద్దని బాబు హితవు పలికారు. సీఎం జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.