సొంతింటికి కేసీఆర్ ఎందుకు వెళ్లినట్లు?

KCR

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని ఉత్తినే చేయరు. ఆయన ఎంతో ముందు జాగ్రత్తతో.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారన్న పేరుంది. అయితే.. తాజాగా ఆయన చేసిన ఒక పని.. ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మాట అనేందుకు అవకాశం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. తనను మాట అనేందుకు అవకాశం ఇవ్వని కేసీఆర్.. అందుకు భిన్నంగా తాజాగా చేసిన పనితో ఆయన మాట అనిపించుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ జరిగిందేమంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జూబ్లీహిల్స్ లోని నందిహిల్స్ లో సొంతిల్లు ఉన్న సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ భవన్ కు కాస్త దగ్గర్లోనే ఆయన నివాసం ఉండేది. ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడి.. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రగతిభవన్ ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించి అందులోకి షిఫ్టు అయ్యారు. ఇందుకోసం ఐఏఎస్ అధికారుల నివాసాల్ని సైతం తొలగించి.. భారీ ఎత్తున ప్రగతిభవన్ ను నిర్మించారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేశారు కూడా. ప్రగతిభవన్ లోకి చేరిన తర్వాత నుంచి ఆయన సొంతింటికి పెద్దగా వెళ్లింది లేదు.

తాజాగా సతీమణి శోభతో కలిసి ఆయన సొంతింటికి వెళ్లారు. గడిచిన కొంతకాలంగా కేసీఆర్ సొంతింటికి రిపేర్లు చేస్తున్నారు. దీంతో.. జరుగుతున్న పనుల్ని స్వయంగా పరిశీలించిన కేసీఆర్.. కొన్నిమార్పులు చేర్పులు సూచించినట్లుగా చెబుతున్నారు. దాదాపు అరగంట వరకు ఆ ఇంట్లోనే ఉన్న కేసీఆర్.. ఇల్లు మొత్తం తిరిగి చూడటం.. అక్కడ జరుగుతున్న పనుల్ని పరిశీలించి.. అవసరమైన మార్పుల్ని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. కేసీఆర్ రావటానికి కొన్ని గంటల ముందే మనమడు హిమాన్షు.. ఇంటికి చేరుకొని ఇంట్లో జరుగుతున్న పనుల్ని స్వయంగా పరిశీలించటంతో పాటు.. దాదాపు గంటకు పైగా సమయాన్ని గడిపినట్లుగా తెలుస్తోంది. ఒకే రోజు కేసీఆర్ ఆయన మనమడు వేర్వేరు సమయాల్లో ఇంటికి వచ్చిన జరుగుతున్న పనుల్ని చూసి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. సొంతింట్లో జరుగుతున్న రిపేర్లకు ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాటల దాడికి అనుకూలంగా మార్చుకుంటారన్న మాట వినిపిస్తోంది.

కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే.. ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ.. ముందే సొంతింటిని చక్కబెట్టుకుంటున్నారని.. ఓడిన తర్వాత ప్రగతిభవన్ లో ఉండటం సాధ్యం కాదు కాబట్టి అంటూ విమర్శల్ని సంధించొచ్చన్న మాట వినిపిస్తోంది. సొంతింటికి రిపేర్లు చేయించుకోవటంలో తప్పు లేకున్నా.. రాంగ్ టైంలో ఆయన ఇంటికి వెళ్లి వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.