ఆయన టీడీపీ ఏపీ శాఖకు పూర్వ అధ్యక్షుడు. పైగా మంత్రిగా కూడా పనిచేశారు. సుదీర్ఘమైన కెరీర్ ఆయనది. నాడు ఎన్టీఆర్ పిలుపును అందుకుని కళా వెంకటరావు యువకుడిగా ఉన్నపుడే రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన 1983లో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ఎన్టీఆర్ జమానాలో ప్రాధాన్యత కలిగిన మంత్రిత్వ శాఖలను చూశారు.
వంగవీటి రంగా హత్య తరువాత కీలకమైన హోమ్ శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. కాపు సామాజిక వర్గంలో సామాజిక సమీకరణలు ఆయన్ను పార్టీలో ఎప్పుడూ ఓ మెట్టు పైనే ఉండేలా చేశాయి. ఆ తర్వాత అనూహ్యంగా కళా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయన రాజ్యసభ సభ్యునిగా ఆరేళ్ల పాటు ఉన్నారు.
ఇక 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిన కళా తిరిగి చంద్రబాబు అభిమానాన్ని చూరగొన్నారు. తిరిగి టీడీపీలోకి వచ్చి మంత్రితో పాటు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కూడా చేపట్టారు. మరి ఇన్ని రకాలుగా కళా విశేష అనుభవం సంపాదించుకున్నా కూడా ఆయన రాజకీయం ఇకపైన సవ్యంగా సాగే పరిస్థితి లేదు.
గతంలో ఆయనది ఉణుకూరు నియోజకవర్గం, 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో అది పోతే ఆయన ఎచ్చెర్లకు రూట్ మార్చారు. అక్కడ బలమైన నేతగా ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి మాటను సైతం కాదని చంద్రబాబు సహకారంతో సీటు సంపాదించుకున్నారు. 2014లో గెలిచినా 2019 నాటికి ఓడారు.
ఇక కళా తన కుమారుడికి 2024 ఎన్నికల్లో ఎచ్చెర్ల సీటు కోసం పట్టుపడుతున్నారు. అయితే అది సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే కళా నాన్ లోకల్ అంటున్నారు. ఈసారి స్థానికులకే టికెట్ ఇవ్వాలని కూడా ఎచ్చెర్ల తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కళానే తాము రెండు సార్లు భరించామని, ఇపుడు ఆయన కొడుకుని కూడా తెచ్చి తమ మీద రుద్దితే సహించేది లేదని తేల్చి చెప్పేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహరంలో కళా రాజకీయం అయోమయంలో పడింది అంటున్నారు. కళా రాజకీయంగా ఇపుడు ఏమంత బలమైన స్థితిలో లేరు.
ఆయన మీద అధినాయకత్వం కూడా మునుపటి నమ్మకం వ్యక్తం చేయడంలేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ అండదండలతో నెట్టుకు వచ్చిన కళా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇక అచ్చెన్న ఎంట్రీతో జిల్లాలో కూడా కళాను పట్టించుకునే పరిస్థితి లేదు. చివరకు కిమిడి నాగార్జునకు విజయనగరం పార్లమెంటరీ పార్టీ పదవి ఇప్పించుకోవడానికే కళా ఆపసోపాలు పడ్డారు. ఆ పదవి కూడా పార్టీ వర్గాలు వ్యతిరేకించాయి. ఇక ఇప్పుడు కళా వారసుడికి ఎచ్చెర్ల నేతలు అంగీకరించే పరిస్థితి లేకపోవడంతో కళా రాజకీయం డైలమాలో పడింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఎచ్చెర్ల కళా కాంతులు ఉండవని తమ్ముళ్ళు తెగేసి చెబుతున్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates