సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజా వ్యాఖ్యలు చూసిన తర్వాత ఎవరికైనా ఇలాంటి అనుమానమే వస్తోంది. మీడియాతో కోమటిరెడ్డి మాట్లాడుతు రేవంత్ చాలా పిల్లోడని ఆయన గురించి తన దగ్గర మాట్లాడద్దని ఏకంగా మీడియా రిపోర్టర్లకే అల్టిమేటమ్ ఇచ్చారు. తాజాగా కోమటిరెడ్డి మాటతీరు చూసిన తర్వాత రేవంత్ పై ఏ స్ధాయిలో మండిపోతున్నారో అర్ధమైపోతోంది.
పీసీసీ పగ్గాల కోసం రేవంత్ తో పాటు కోమటిరెడ్డి కూడా చివరి నిముషం వరకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అనేక అంశాలను భేరీజు వేసుకున్న అధిష్టానం చివరకు రేవంత్ వైపే మొగ్గుచూపింది. దాంతో ఒకవైపు అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తంచేస్తునే మరోవైపు రేవంత్ ను వ్యతిరేకిస్తున్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత రేవంత్ చాలామంది సీనియర్లను నేరుగా వెళ్ళి కలిశారు కానీ కోమటిరెడ్డి, జీవన్ రెడ్డిని మాత్రం కలవలేదు. బాధ్యతలను తీసుకునేటపుడు కూడా వీళ్ళిద్దరిని రేవంత్ వ్యక్తిగతంగా ఆహ్వానించలేదు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే రేవంత్ పై కోమటిరెడ్డి బాగా మండిపోతున్నారు. తనకు పీసీసీ రాలేదన్న కారణంగా ఇతర పార్టీల్లోకి వెళ్ళే ఆలోచన లేదన్నారు. పార్టీలోనే ఉండి పార్టీ బలోపేతానికి కష్టపడతానని చెప్పటం గమనార్హం.
ఇదే సమయంలో పీసీసీ అధ్యక్ష పదవి తన దృష్టిలో చాలా చిన్నదని కోమటిరెడ్డి చెప్పటమే విచిత్రంగా ఉంది. నిజంగానే పీసీసీ అధ్యక్షపదవి అంత చిన్నదే అయితే మరెందుకు ఆ పదవి కోసం అంతలా ప్రయత్నించారో అర్ధం కావటంలేదు. నిజంగానే పీసీసీ పదవి చాలా చిన్నదైతే, రేవంత్ పిల్లోడే అయితే ఎందుకింతగా వ్యతిరేకిస్తున్నారో కోమటిరెడ్డే సమాధానం చెప్పాలి.