టీడీపీలో ఎంపీ VS మాజీ ఎమ్మెల్యే… సోష‌ల్ వార్‌…!

ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీలో ఎక్కడ చూసినా పార్టీ నేతల మధ్య వర్గ పోరు తీవ్రంగా ఉంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అయినా పార్టీ గెలుస్తుందన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లోనే చాలామందికి లేదు.

ఇలాంటి సమయంలో పార్టీ నేతలు అందరూ కలిసికట్టుగా ఒకే తాటిపై పని చేసి పార్టీని బలోపేతం చేయాలి. కానీ నాయకులు ఎక్కడికక్కడ వ‌ర్గ రాజ‌కీయాల‌కు తెర‌దీస్తున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పార్టీ చిత్తుగా ఓడిపోయినా నేతల తీరు మాత్రం మారడం లేదు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తూ పార్టీని మరింత బలహీనం చేస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు.

ఒక నేత అనుచరులు మరొక నేతపై బురద జల్లుడు కార్యక్రమంతో పార్టీ పరువును బజారు పాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు పెద్ద మైన‌స్ అన్న‌ విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బెజవాడ టీడీపీలో నేతల మధ్య ఉన్న అనైక్యత ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధంగా మారింది.

గ‌త కార్పొరేష‌న్ ఎన్నిక‌ల వేళ ఎంపీ కేశినేని నాని టార్గెట్‌గా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరా లాంటి నేత‌లు రోడ్డెక్కి మ‌రీ ప్రెస్‌మీట్లు పెట్టారు. ఎంపీ నానితో క‌లిసి తాము న‌డిచేదే లేద‌ని చెప్పారు. చంద్ర‌బాబు స‌ర్ది చెప్పినా వీరు చేయాల్సింది చేయ‌డంతోనే గెల‌వాల్సిన కార్పొరేష‌న్లో టీడీపీ చిత్తుగా ఓడింది.

ఇక ఇప్పుడు ఎంపీ కేశినేని నానిని టార్గెట్‌గా చేసుకుని బొండా ఉమా అనుచ‌రులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఉమాకు అనుచ‌రులుగా ఉండే కొంద‌రు నేత‌లు తాము కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీలుగా పోటీ చేస్తామ‌ని చెప్పుకుంటున్నారు. ప్ర‌భుత్వంలో లోపాల‌పై పోరాటానికి వీరు సోష‌ల్ మీడియాను వాడ‌కుండా సొంత పార్టీ నేత‌ను టార్గెట్ చేసేందుకు బాగా వాడుతున్నారు.

ఇక అటు ఎంపీ అనుచ‌రులు సైతం బొండాను టార్గెట్‌గా చేసుకుని సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎంపీ నాని త‌న కుమార్తెను అసెంబ్లీ బ‌రిలో దించాల‌ని సోష‌ల్ మీడియా ప్ర‌చారం చేస్తుంటే.. ఇటు బొండా అనుచ‌రులు ఎంపీకి పోటీగా మ‌రి కొంద‌రిని ఉసుగొల్పుతున్నారు. ఈ ప‌రిస్థితి మార‌క‌పోతే బెజ‌వాడ‌లో టీడీపీకి టీడీపీయే శ‌త్రువు అవుతుంది.