వచ్చే ఏడాదిలో జరగబోతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నరేంద్రమోడిలో టెన్షన్ ఏ స్ధాయిలో పెంచుతున్నాయో స్పష్టంగా అర్ధమైపోతోంది. తాజాగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ప్రక్షాళనను గమనిస్తే ఈ విషయం స్పష్టమైపోతుంది. తాజా మంత్రివర్గంలో నరేంద్రమోడి 77 మందిని తీసుకున్నారు. వీరిలో ఒక్క యూపీ నుండే 14 మంది మంత్రులున్నారు. 77 మందిలో 14 మంది ఒక్కరాష్ట్రం నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే మామూలు విషయం కాదు.
అలాగే గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇంతమంది యూపీ నుండి ప్రాతినిధ్యం వహించిందిలేదు. మరలాంటపుడు ఏకంగా 14 మందిని ఒక్క యూపీ నుండే మోడి ఎందుకు తీసుకున్నారు ? ఎందుకంటే తనలో యూపీ ఫోబియా పెరిగిపోతోంది కాబట్టే. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ బీజేపీని తిరిగి గెలిపించుకోవటం మోడికి చాలా అవసరం. అసెంబ్లీ ఎన్నికల్లో కమలంపార్టీ ఓడిపోతే ఆ తర్వాత జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కూడా దాని ప్రభావం పడిందంటే మోడి పని గోవిందానే.
పైగా అతిపెద్ద రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిందంటే అది మోడికి వ్యక్తిగతంగా చాలా అవమానం. ఎందుకంటే యూపీలోని వారణాసి లోక్ సభ నుండే మోడి ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ప్రస్తుతానికి వస్తే యోగి ఆదిత్యనాద్ ప్రభుత్వంపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది. లవ్ జీహాద్, శాంతిభద్రతలు క్షీణించటం, దళితులపై పెరిగిపోతున్న దాడులు+కరోనా వైరస్ తీవ్రత నియంత్రణలో వైఫల్యం అన్నీ కలిపి వ్యతిరేకత పెరిగిపోతోంది.
ఇన్ని వ్యతిరేకతల మధ్య జరిగిన రెండు విడతల స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మొదటిది ఘోరంగా ఓడిపోయి, రెండోదానిలో ఘన విజయం సాధించింది. ఇదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ప్రాంతీయపార్టీలు, జాతీయ పార్టీలు ఒకవైపు, చిన్నపార్టీలు మరోవైపు కూటములు కడుతున్నాయి. వీటిన్నింటికి అదనంగా మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల్లో వ్యతిరేకత ఎలాగూ ఉంది. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఏకంగా 14 మందిని మోడి కేంద్రమంత్రులను చేశారు. మరి వీళ్ళంతా గట్టిగా పనిచేసి మోడి పరువు నిలుపుతారా ? చూద్దాం ఏం జరుగుతుందో.