రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని జలవివాదాలు.. మరో టర్న్ తీసుకున్నాయి. ఈ వివాదాన్ని సర్దుమణిగేలా చేయాలని.. తెలంగాణ సర్కారు భావించకపోగా.. ఏపీ చేస్తున్న ప్రయత్నాలపై మరింత రెచ్చిపోతోంది. ఏపీ సర్కారును మరింత ఇరకాటంలోకి నెడుతూ.. తన ఒంటెత్తుపోకడలతో.. పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతోంది. గడిచిన వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ ఇష్యూలు వీరంగం వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తొలుత శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేయాలని.. అది కూడా 100 శాతం చేయాలని ఆదేశాలు జారీచేశారు.
అయితే..దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు ప్రారంభించింది. పైకి మౌనంగా ఉంటూనే.. కేంద్రానికి.. కృష్నారివర్ బోర్డుకు లేఖలు రాయడం ప్రారంభించింది. అదేసమయంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు కూడా లేఖ రాశారు సీఎం జగన్. అదేవిధంగా ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని కూడా అభ్యర్థించారు. వాస్తవానికి ఇలాంటివి జరిగినప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఒకింత ఆలోచిస్తుంది. కానీ, ఈ పరిణామాల క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. తీవ్రస్థాయిలో దూకుడు పెంచారు. తొలుత శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన తెలంగాణ సర్కారు.. తర్వాత.. నాగార్జున సాగర్ వద్దకు చేరింది.
ఈ క్రమంలో ఏపీలో ఆందోళనలను ప్రారంభం కాగానే.. పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి.. ఏకంగా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది. నిజానికి ఆయా రిజర్వాయర్లలో తెలంగాణ తన పరిమితికి మించి నీటిని వాడుతోందని.. ఇది అక్రమమని, అన్యాయమని.. అన్ని వర్గాల నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే.. ఏపీ ప్రభుత్వం ఫిర్యాదుతో కదిలిన కృష్ణారివర్ బోర్డు.. త్రిసభ్య కమిటీని వేసి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. దీంతో కేసీఆర్ సర్కారు మరింత రెచ్చిపోయింది. పులిచింతలలో మరింతగా విద్యుత్ ఉత్పాదనను పెంచేసింది.
సోమవారం.. పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తిని డబుల్ చేయాలంటూ.. ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు అప్పటి వరకు 25 మెగావాట్లు ఉన్న విద్యుత్ ఉత్పత్తిని.. 50 మెగావాట్లకు పెంచారు. దీంతో 9900 క్యూసెక్కుల నీటిని పులిచింతల నుంచి దిగువకు విడుదల చేయాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఇలా నీటిని వాడేయడం.. విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం అనేది.. అక్రమమని తెలిసినా.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనిని బట్టి.. ఏపీతో ఎంతకైనా.. ఢీ అంటే ఢీ అనే విధంగానే ముందుకు సాగుతోందని అంటున్నారు పరిశీలకులు. గతంలో చేసుకున్న ఒప్పందాలను తోసరాజని.. జలాల విషయంలో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న ధోరణి.. సమంజసం కాదని అంటున్నారు పరిశీలకులు.