వైసీపీ ఎంపీ పై ఐటీ కన్ను..!

వైసీపీ రాజ్యసభ ఎంపీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు అయిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పై ఐటీ అధికారుల కన్ను పడింది. ఆయనకు చెందిన ఆస్తులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.

హైదరాబాద్‌లోని ఐటీ విభాగానికి చెందిన దాదాపు 15 మంది అధికారులు అయోధ్య రామిరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. గచ్చిబౌలిలోని రాంకీ గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు గ్రూప్ అనుబంధ సంస్ధల కార్యాలయాల్లోనూ ఐటీ అధికారుల బృందం సోదాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

వైసీపీ మూల స్తంభాల్లో ఒకరైన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఇళ్లపై ఐటీ సోదాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపుతున్నాయి. రాంకీ గ్రూప్ అధినేతగా ఉన్న అయోధ్య రామిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభకు ఎంపికైన ఎంపీల్లో అత్యధిక ధనవంతుల జాబితాలో అగ్రస్ధానంలో ఉన్నారు.

ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న రాంకీ గ్రూప్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ తో పాటు పలు రంగాల్లో చురుగ్గా పనిచేస్తోంది. దీంతో ఆయన లావాదేవీలపై ఐటీ కన్ను పడినట్లు తెలుస్తోంది. రాంకీ గ్రూప్ అధినేతగా ఉంటూనే జగన్ కు సస్నిహితుడిగా పేరు తెచ్చుకున్న అయోధ్య రామిరెడ్డి గతేడాది రాజ్యసభ ఎంపీగా ఏపీ కోటాలో ఎన్నికయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అయోధ్య రామిరెడ్డి స్వయానా సోదరుడు కావడం గమనార్హం.