టీపీసీసీ చీఫ్ పదవి కోసం చాలా మందే ప్రయత్నించారు. తమకే దక్కుతుందని చాలా మంది సీనియర్లు ఎదురు చూశారు. కానీ చివరకు ఆ పదవి రేవంత్ రెడ్డిని వరించింది. దీంతో.. చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు అలకపాన్పు ఎక్కారు. వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.
కాగా.. తాజాగా ఆయన తన అలక వీడారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమాకంతో సైలెంట్ గా ఉన్న భట్టిని ఇటీవలే ఏఐసీసీ ఢిల్లీకి పిలిపించింది. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వటానికి గల కారణాలు, పొలిటికల్ ఈక్వేషన్స్ చూపి రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో అలక వీడిన భట్టి బుధవారం జరిగే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ బాధ్యత స్వీకార కార్యక్రమానికి హజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. భట్టి అలక వీడటంతో… సాయంత్రం రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
రాష్ట్ర పార్టీకి పీసీసీ చీఫ్, సీఎల్పీ జోడెడ్ల వంటి వారని… ఈ ఇద్దరు నేతలు దూకుడుగా, సమన్వయంతో ఉంటేనే పార్టీ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను కొట్టగలదని సీనియర్ నేత మల్లు రవి అభిప్రాయపడ్డారు. ఇటు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితోనూ సాయంత్రం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు.