చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి జనాల మధ్యలోని వస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా చాలా కాలంగా తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసుకే జగన్ పరిమితమైపోయిన విషయం తెలిసిందే. గడచిన ఏడాదిన్నరలో ఎంతో అవసరమైతే తప్ప జగన్ బయటకు రాలేదు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ ప్రమాధం లాంటి ఘటనల్లో బాధితులను పరామర్శించేందుకు మాత్రమే క్యాంపు ఆఫీసు నుండి బయటకొచ్చారు.
అలాంటిది ఈనెల 7, 8 తేదీల్లో కడప, అనంతపురం జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. రెండు జిల్లాల్లోను శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు పెట్టుకున్నారు. పనిలో పనిగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు మంత్రులు, ఎంఎల్ఏలతో ఎలాగూ సమావేశాలుంటాయి. ఈ రెండు జిల్లాల పర్యటనల తర్వాత గోదావరి జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలో కూడా పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ జిల్లాల పర్యటన ఇలాగుండగానే ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనను వచ్చే నెలలో ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. తొందరలోనే విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా జగన్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే వచ్చే నెలలో ఉత్తరాంధ్ర పర్యటనపై సర్వత్రా ఆసక్తి పెరిగిపోతోంది.
కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిందనే కారణంగానే జగన్ జిల్లాల పర్యటనలకు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు క్యాంపు ఆఫీసు నుండే కరోనా వైరస్ పై జగన్ ప్రతిరోజు సమీక్షలు చేస్తున్నారు. జిల్లాల పర్యటనలో కలెక్టర్లతోనే కాకుండా బాధిత కుటుంబాలను కూడా నేరుగా కలవనున్నట్లు సమాచారం. మొత్తంమీద జగన్ జిల్లాల పర్యటనలపై ఆసక్తి పెరిగిపోతోంది.