మంత్రి సబితా ఇంద్రారెడ్డికి స్టూడెంట్స్ షాక్..!

తెలంగాణ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి విద్యార్థులు ఊహించని షాక్ ఇచ్చారు. విద్యార్థులంతా కలిసి ఆమె ఇంటిని ముట్టడించారు. ఓయూ, జేఎన్టీయూ యూనివర్శిటీ విద్యార్థులంతా.. ఆమె ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. కరోనా నేపథ్యంలో.. ఇటీవల ఇంటర్, పది తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే… ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు మాత్రం వాయిదా వేయలేదు. దీంతో.. తమకు కూడా పరీక్షలు వాయిదా వేయాలంటూ వారు డిమాండ్ చేయడం గమనార్హం.

సత్యసాయి నిగమాగమం నుంచి సబితా ఇంటి వరకూ ర్యాలీ నిర్వహించారు. ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని లేకుంటే ఆన్ లైన్‌లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు టీకాలు వేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. విద్యార్థులందరూ దాదాపు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటారని.. అందరూ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకోని నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని నిరసన తెలిపారు.

దీంతో మంత్రి జోక్యం చేసుకొని ఆందోళనను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఆమె ధర్నా చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. ఇప్పటికే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థులు కోరిన చోట పరీక్షలు రాసే అవకాశం కల్పించామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూనే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్నారు. పరీక్షల వాయిదాపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని వెల్లడించారు. అన్ని అంశాలను పరిశీలించాకే పరీక్షలు నిర్హహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

విద్యార్థులు ఎక్కడ కోరితే అక్కడ పరీక్ష కేంద్రాలు ఉండేలా అవకాశం కల్పిస్తామని మంత్రి చెప్పారు. అన్ని అంశాలను పరిశీలించడంతో పాటు లక్షలాది మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షల వాయిదాపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. స్పష్టమైన నిర్ణయం తెలపాలని డిమాండ్‌ చేసిన విద్యార్థులు మంత్రి నివాస సమీపంలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.