బెజవాడ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న వంగవీటి రంగా వారసుడు రాధా.. ఎప్పటికప్పుడు చతికిలపడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ టు.. ప్రజారాజ్యం.. అటు నుంచి వైసీపీ తర్వాత టీడీపీ ఇలా ఒకచోట కూడా కుదురుగా ఉండలేక ఆయన సతమతం అవుతున్నారు. ఏ పార్టీలో ఉన్నా వివాదాస్పదం అవుతుండడం మరో గొప్ప విషయం. ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారో.. లేదో .. తేల్చుకోలేని ఒక సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు వాస్తవానికి వస్తే.. విజయవాడ టీడీపీ పరిస్థితే బాగోలేదు. దీంతో రాధా.. ఇప్పుడు బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారట.
త్వరలోనే ఆయన మళ్లీ వైసీపీలో చేరేందుకు మార్గం వెతుక్కుంటున్నారని అంటున్నారు. తూర్పు గోదావరికి చెందిన కాపు సామాజిక వర్గం కీలక నేతతో ఇటీవల ఆయన విజయవాడలో భేటీ అయ్యారని, తనను వైసీపీలోకి చేర్చుకునేలా రాయబారం చేయాలని సదరు నేతను కోరారని ప్రచారం జరుగుతోంది. జగన్ దగ్గర ఇటీవల కాలంలో ఈ నేతకు పరపతి పెరగడంతో పాటు.. కొత్త నేతే అయినా.. ఇటీవల కీలక పదవిని సొంతం చేసుకున్నారు. పైగా ఆయనకు కాపు సామాజిక వర్గంలో మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో ఈయన ద్వారా అయితే.. వర్కవుట్ అవుతుందని.. రాధా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సదరు నేత కూడా అంగీకరించినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే విషయం.. సీఎం జగన్కు కూడా చేరిందని తెలుస్తోంది. అయితే.. గతంలో రాధా వ్యవహరించిన తీరును కొందరు విజయవాడ నేతలు.. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు మళ్లీ తెరమీదికి తెస్తున్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ను అధికారంలోకి రాకుండా చూస్తానంటూ.. ఆయన యాగాలు చేశారని.. వారు గుర్తు చేస్తున్నారు. ఒక నిర్ణయం మీద కట్టుబడి ఉండే నాయకుడు కూడా కాదని.. వారు అప్పుడే.. లోపాయికారీగా స్థానిక పత్రికలకు, మీడియాకు ఉప్పందిస్తున్నారు.
దీంతో ఇప్పుడు రాధాపై స్థానికంగా ఉండే ఓ ఛానెల్లో వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. అయినప్పటికీ.. జగన్ ఇవేవీ పట్టించుకోరని.. చేర్చుకోవాలని అనుకుంటే.. ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారని.. ఇదే మంచి సమయమని.. రాధా అనుచరులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates