వరుస విజయాలు దక్కించుకుని కేంద్రంలో చక్రం తిప్పుతున్న నరేంద్ర మోడీని గద్దె దింపేయాలి! ఇదీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు, బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల వ్యూహం!! ఈ క్రమంలోనే గతంలో మోడీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించి.. తర్వాత విభేదించిన ప్రశాంత్ కిషోర్‌ను ఇప్పుడు ప్రతిపక్ష నేతలు.. తమ గూటికి చేర్చుకుని మంత్రాంగం నెరుపుతున్నాయి.
ఇదీ గుసగుస!
ఈ క్రమంలోనే బలమైన థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ద్వారా.. మోడీకి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే.. మోడీ ఇవేవీ తెలియని అమాయక నేత అయితే.. కాదు కదా? ఇప్పుడు ఆయన వీరి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రాంతీయ పార్టీలు కానీ, నేతలు కానీ.. తనపై చేసే వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు మోడీ.. ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన పలు కీలక నిర్ణయాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా.. ఇతర నేతలతో పంచుకున్నారని.. డిల్లీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తప్పు మోదీది కాదట!
ఈ వ్యూహాల ప్రకారం.. ప్రధానిగా తన ఇమేజ్‌ను రక్షించే బాద్యతను బీజేపీపైనే పెట్టినట్టు తెలుస్తోంది. అదేసమయంలో ప్రాంతీయ పార్టీలపై ఎదురుదాడి చేయడంతో పాటు.. ప్రస్తుతం తనపై వస్తున్న వ్యతిరేకతకు తాను కారణం
కాదని.. రాష్ట్రాల నేతలే బాధ్యులని ప్రచారం కల్పించేందుకు వ్యూహం
రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలు, కరోనా మరణాలు, వ్యాక్సిన్ పంపిణీ.. వంటివి విషయాలు మోడీకి తీవ్ర ఇబ్బందిగా మారాయి. అయితే.. ఈ ఎఫెక్ట్ అంతా తమది కాదని.. రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలేనని ప్రచారం చేయనున్నారు.
లెక్కలు తేల్చేస్తారు!
అదేసమయంలో ఇప్పటి వరకు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న నిధులు.. ఆయా రాష్ట్రాలు చేస్తున్న ఖర్చులను ప్రజల్లోకి తీసుకువెళ్లి.. ఏ రాష్ట్రానికి ఎంత వరకు కేంద్రంలోని మోడీ సహకరిస్తున్నారనే విషయాన్ని బీజేపీ నేతలు ఇంటింటికీ ప్రచారం చేయనున్నారు.
మోడీ బొమ్మతో సంచులు!
అదేసమయంలో గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద పేదలకు ఇస్తున్న సరుకులకు.. మోడీ ఫొటోతో కూడిన సంచులను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి గాను సంచులకు అయ్యే ఖర్చును బీజేపీ పార్టీ భరిస్తుందట! ఇలా.. ప్రజల్లోకి మోడీ సేవలపై ప్రచారం చేయడం ద్వారా థర్డ్ ఫ్రంట్‌కు బ్రేకులు వేయాలని భావిస్తున్నారు. మరి ఇది ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.