భారత్ హెచ్చరికతో దిగొచ్చిన ‘సంపన్న దేశాలు’

మంచిగా చెబితే ఎవరు వింటున్నారిప్పుడు? ఎవరికైనా సరే.. వారికి అర్థమయ్యే భాషలో చెబితే కానీ దారికి రాని పరిస్థితి. సంపన్న దేశాలు కొన్ని తీసుకునే తలతిక్క నిర్ణయాలకు.. వారికి అర్థమయ్యే భాషలో చెబితే కానీ అర్థం కాదన్న విషయాన్ని భారత ప్రభుత్వం అర్థం చేసుకోవటమే కాదు.. అందుకు తగ్గట్లు వ్యవహరించి సానుకూల ఫలితాల్ని తీసుకొచ్చేలా చేయటంలో సక్సెస్ అయ్యింది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో విదేశాల నుంచి తమ దేశాలకు వచ్చే వారికి గ్రీన్ పాసులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆయా దేశాల వారు తాము ఓకే చేసిన వ్యాక్సిన్లు వేసుకున్న వారికి మాత్రమే తమ దేశాల్లో అడుగు పెట్టేందుకు అనుమతి ఇస్తున్నాయి. సంపన్న యూరోపియన్ దేశాల (ఈయూ) వారి జాబితాలో భారత్ లో వేస్తున్న కొవాగ్జిన్.. కొవిషీల్డ్ టీకాల పేర్లు లేవు. దీంతో.. ఆ రెండు టీకాలు వేసుకున్న భారతీయులను తమ దేశాలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నాయి. దీంతో యూరోపియన్ దేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇబ్బందిగా మారింది.

యూరోపియన్ యూనియన్ లో స్విట్జర్లాండ్.. జర్మనీ.. స్లోవేనియా.. ఆస్ట్రియా.. గ్రీస్.. ఐల్యాండ్.. ఐర్లాండ్.. స్పెయిన్ లాంటి 27 దేశాలు ఉన్నాయి. వీరంతా భారతీయులకు గ్రీన్ వీసాలు ఇచ్చేందుకు నిబంధనలు అడ్డుకుంటున్నట్లుగా చూపిస్తున్నారు. దీంతో.. ఈ విషయంపై భారత ప్రభుత్వం ఈయూతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో.. భారత్ తన స్వరం మార్చి.. వారికి మాదిరి.. తమ దేశానికి వచ్చే ఈయూ దేశాల వారికి.. వారి దేశాల్లోని వ్యాక్సిన్ సర్టిఫికేట్లను అంగీకరించమని.. కఠినమైన క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తామని చెప్పింది.

ఈ వార్నింగ్ ఈయూ మీద బాగానే పని చేసినట్లు కనిపిస్తోంది. తాజాగా ఈయూలోని ఎనిమిది దేశాలు భారత ప్రయాణికులకు ఊరటనిచ్చే ప్రకటన చేశాయి. తమ అప్రూవ్డ్ టీకా జాబితాలో కొవిషీల్డ్ ను చేర్చినట్లుగా పేర్కొన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మిగిలిన దేశాలు సైతం త్వరలోనే తమ తీరును మార్చుకునే వీలుందని చెబుతున్నారు. ఈయూ దేశాల తాజా నిర్ణయం.. భారత్ నుంచి ఆయా దేశాలకు వెళ్లే వారికి వ్యాక్సిన్ చిక్కులు తప్పేలా చేసింది.