ప్రియాంక ఇంత యాక్టివ్ అయ్యారా ?

అవును ఇది కాంగ్రెస్ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపే విషయమే. అవును ఇంతకాలం పార్టీ కార్యక్రమాల్లో అంతంత మాత్రంగానే ప్రియాంక గాంధీ పార్టిసిపేట్ చేస్తుంటారు. పేరుకు జాతీయ ప్రధాన కార్యదర్శే కానీ అంత చొరవ చూపించటం లేదని చాలామంది తెగ బాధపడిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి అస్సాం ఎన్నికల్లో పూర్తిస్ధాయిలో ప్రచారానికి దిగటంతో ఇకనుండి పార్టీ కార్యక్రమాల్లో కూడా ప్రియాంక ఫుల్లుగా ఇన్వాల్వయి పోతారని అందరు ఆశించారు.

అయితే ఎన్నికల వేడి తగ్గిపోగానే ప్రియాంక కూడా పెద్దగా ఎక్కడా కనబడలేదు. అలాంటిది పంజాబ్ లో ఇద్దరు కీలక నేతల మధ్య వివాద పరిష్కారంలో ప్రియాంక చొరవ చూపించారనే వార్త హస్తంపార్టీ నేతల్లో జోష్ నింపేసింది. వచ్చే మార్చిలో ఎన్నికలకు వెళ్ళాల్సిన రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలంటే నేతల మధ్య ఎంతటి ఐకమత్యం ఉండాలి. అలాంటిది 24 గంటలు కొట్టుకుంటుంటే మామూలు జనాలకేంటి పార్టీ నేతలకే చీదరపెట్టేస్తోంది.

ఇలాంటి నేపధ్యంలో ప్రియాంక చొరవ చూపించి సీఎం అమరీందర్ సింగ్-నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య మధ్యస్తం చేశారట. ఇంతకన్నా పెద్ద విషయం ఏమిటంటే సిద్ధూను కలవటానికి రాహూల్ గాంధి ఇష్టపడకపోతే ప్రియాంక కారణంగానే వాళ్ళిద్దరి భేటి కూడా జరిగిందట. రాహూల్ ను కలవటానికి సిద్ధూ అపాయిట్మెంట్ అడిగితే రాహూల్ కాదన్నారట.

అయితే తనతో సిద్ధూ భేటీ అయిన తర్వాత ఊహిచని విధంగా సిద్ధూకు రాహూల్ నుండి ఫోన్ వచ్చిందట. వెంటనే వచ్చి కలవమన్నారట. విషయం ఏమిటాని తర్వాత సిద్ధూ ఆరాతీస్తే ప్రియాంకే సోదరుడు రాహూల్ కు ఫోన్ చేసి సిద్ధూకి అపాయిట్మెంట్ ఇవ్వమని కోరిందట. దాంతో ప్రియాంక మాటను కాదనలేక రాహూల్ ఫోన్ చేసి మరీ పిలిపించుకున్నారు. ఇపుడిదే విషయంపైనే కాంగ్రెస్ పార్టీలో బాగా చర్చ జరుగుతోంది. పార్టీ నేతల మధ్య వివాద పరిష్కారానికి ప్రియాంక చొరవ చూపటం కన్నా కావాల్సిందేముంటుంది ?