జగన్ ఆస్తి పన్ను కట్టలేదా?

ప్రజలు నిబంధనలు పాటించాలని, సక్రమంగా పన్నులు కట్టాలని చెప్పే ప్రభుత్వ అధినేతలు.. ముందు తాము అవన్నీ సక్రమంగా చేస్తుండాలి. తమ వైపు ఎవరూ వేలెత్తి చూపించేలా చేయకూడదు. ఐతే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం పాటించట్లేదని వెల్లడైంది.

పన్నులు కట్టడంలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఆయన.. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆస్తి పన్ను చెల్లించలేదన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓ ప్రధాన పత్రికలో దీనిపై వచ్చిన కథనం సంచలనం రేపుతోంది. ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు అమరావతిలోని తాడేపల్లిలో జగన్ భారీ భవంతిని కట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ భవనానికి రెండేళ్ల నుంచి ఆస్తి పన్ను కట్టట్లేదట. ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి పన్ను కట్టడం మానేశారట జగన్.

మొత్తం రూ.13.85 లక్షల మేర పన్ను బకాయి పడ్డారని.. దానికి జరిమానా రూ.2.82 లక్షలని.. మొత్తంగా మున్సిపల్ శాఖకు జగన్ కుటుంబం రూ.16.67 లక్షలు కట్టాల్సి ఉందని కథనంలో పేర్కొన్నారు. ఈ ఇల్లు జగన్ సతీమణి వైఎస్ భారతి పేరిట ఉందట. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాధ్యతతో మెలగాల్సిన ముఖ్యమంత్రి ఇలా పన్ను చెల్లించకపోవడం ఏమిటని.. ఓవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భారీగా పన్నులు వేస్తూ, తాము పన్ను కట్టకపోవడం ఏమిటని.. ఒక సామాన్యుడు ఇలా పన్ను చెల్లించకుంటే అధికారులు ఊరుకుంటారా అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన మద్దతుదారులు ఈ కథనాన్ని వైరల్ చేస్తూ వైకాపా వాళ్లకు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనిపై జగన్ మద్దతుదారులు ఏమంటారో మరి?