లక్షలాది టీకాలు ఎటుపోతున్నాయ్ ?

కోవిడ్ టీకాలు వేయటంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఫెయిలయ్యాయా ? కేంద్రప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి తాజాగా రాసిన లేఖను చదివితే అందరికీ ఇదే అనుమానం వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడికి సీఎం రాసిన లేఖలో ఇదే విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. ప్రైవేటు ఆసుపత్రులు వినియోగించుకోగా మిగిలిపోయిన టీకాలను కేంద్రమే కొని తిరిగి తమ ప్రభుత్వానికి కేటాయించాలని జగన్ రిక్వెస్ట్ చేశారు.

సవరించిన టీకా విధానంలో భాగంగా టీకా ఉత్పత్తి కంపెనీల నుండి ప్రైవేటు ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు 25 శాతం కొనుగోలు చేయవచ్చని కేంద్రం డిసైడ్ చేసింది. దీని ప్రకారం జూన్ నెలలో ఏపిలోని ప్రైవేటు ఆసుపత్రులు, ఫ్యాక్టరీలకు 17, 71, 580 టీకాలను కేటాయించింది. అయితే ఇందులో వినియోగించుకున్నది కేవలం 2, 67,075 మాత్రమే. జూన్ లో కేటాయించిన టీకాలే ఇంత భారీ స్ధాయిలో మిగిలిపోతే మళ్ళీ జూలైలో కూడా 17 లక్షలు కేటాయించారట.

అంటే రాబోయే నెలలలో కూడా మళ్ళీ సుమారు 15 లక్షల టీకాలు మిగిలిపోవటం ఖాయమన్నట్లుగా జగన్ అభిప్రాయపడ్డారు. ఇన్నేసి లక్షల టీకాలు మిగిలిపోతున్నపుడు వాటన్నింటినీ కేంద్రమే కొనేసి మళ్ళీ ఏపికి ఎందుకు కేటాయించకూడదని జగన్ అడిగారు. ఇది ఒక్క ఏపి అనుభవం మాత్రమే కాదని, చాలా రాష్ట్రాల్లో ఇలాగే జరుగుతున్నట్లు కూడా సీఎం చెప్పారు.

ఏపిలోని ప్రైవేటు ఆసుపత్రులు, ఫ్యాక్టరీలకు కేటాయించిన 17 లక్షల టీకాల్లో 2.7 లక్షల టీకాలు మాత్రమే వినియోగంలోకి వచ్చింది నిజమే అనుకుందాం. మరి మిగిలిన లక్షలాది టీకాలు ఏమయ్యాయి ? ఎటుపోయాయి ? అన్నదే ప్రశ్న. ఈ విషయాన్ని జగన్ తన లేఖలో ఎక్కడా ప్రస్తావించలేదు. లక్షలాది టీకాలను దగ్గర పెట్టుకుని ప్రైవేటు ఆసుప్రతులు, ఫ్యాక్టరీలు మాత్రం ఏమి చేసుకుంటాయి ? డబ్బులు పెట్టి ఉత్పత్తి కంపెనీల నుండి కొన్న తర్వాత టీకాలను వినియోగంలోకి తేకుండా ఎందుకుంటాయి ?

మెజారిటి టీకాలు బ్లాక్ మార్కెట్లోకి వెళిపోతున్నాయా ? ఒకవేళ ఇదే నిజమనుకుంటే అప్పుడు టీకాలు మిగలకూడదు కదా ? వెయ్యిరూపాయిలు పెట్టి టీకాలు వేయించుకునేందుకు చాలామంది రెడీగా ఉన్నారు. మరలాంటపుడు జనాలకు టీకాలు వేయకుండా ఆసుప్రతులు, ఫ్యాక్టరీలు వాటిని ఏమి చేసుకుంటున్నాయి ? కొనుగోలు చేసిన టీకాలు వేయకపోతే ఆసుపత్రులకే కదా నష్టం ? ఏమో తెరవెనుక ఏమి జరుగుతోందో అర్ధం కావటంలేదు. మరి కేంద్రం ఆరాతీస్తే కానీ బయటపడదేమో, చూద్దాం ఏం జరుగుతోందో.