ఏపీ సీఎం జగన్.. ఇటీవల ఢిల్లీ పర్యటన చేశారు. అయితే దీనికి సంబంధించి అనేక విశ్లేషణలు.. వార్తలు వచ్చాయి. నిధుల కోసమే వెళ్లామని.. గట్టిగా నిలదీశామని.. ప్రభుత్వం తరపున వాదన కూడా వినిపించింది. ఇక, ప్రతిపక్షాలు చేసిన విమర్శలు మరో ఎత్తు. అయితే.. ఇప్పుడు వీటికి భిన్నంగా.. జగన్ ఢిల్లీ టూర్‌లో జరిగిన ఓ విషయం ఆసక్తికరంగా వెలుగు చూసింది. ఢిల్లీ టూర్‌లో కేంద్ర హోంమంత్రిని కలిసిన సీఎం జగన్‌కు మోడీ మాటగా.. అమిత్‌షా.. ఓ బిగ్ ఆఫర్ ప్రకటించారని తెలుస్తోంది. ఈ విషయం వైసీపీ కీలక నేతల నుంచి కాస్త ఆలస్యంగా మీడియా వర్గాలకు లీక్ అయ్యింది.
ఈ ఆఫర్ విషయంలో అప్పటికప్పుడు జగన్ ఏమీ చెప్పకపోయినా.. ఇప్పుడు నిర్ణయం తీసుకునే సమయం మాత్రం ఆసన్నమైంది.
ఇప్పుడు ఇదే విషయం.. వైసీపీలో ఆసక్తికరంగా మారింది. అదేంటంటే.. త్వరలోనే కేంద్ర కేబినెట్‌ను ప్రక్షాళన చేయనున్నారు. ఈ క్రమంలో మోడీ.. జగన్ ను కూడా ఎన్డీయే భాగస్వామిగా చేరాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు మంత్రి పదవులు కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే.. ఇదేమీ.. మోడీ ఉచితంగా ఇవ్వడం లేదు. ఉత్తరాదిన ప్రాధాన్యం కోల్పోతున్న మోడీకి.. ఎన్డీయే కూటమి నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. చాలా మంది మిత్రులు చెయ్యిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తవారికి ఆయన ఆహ్వానం పలుకుతున్నారు.
అందునా..తాను చెప్పినట్టు నడుచుకునేవారు..తన మాటకు ఎదురు చెప్పనివారి కోసం మోడీ తహతహ లాడుతున్నారు. ఇప్పుడు జగన్ కొన్ని కేసుల్లో ఉండడం.. ఆయనకు సీబీఐ నుంచి కొంత మేరకు ఉపశమనం లభించాలంటే.. కేంద్రం ఆశీస్సులు అవసరం ఉన్న నేపథ్యంలో మోడీ.. లౌక్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో తనను కాదని బయటకు పోయిన.. ఉత్తరాది పార్టీలకు తగిన విధంగా షాక్ ఇచ్చేందుకు కూడా మోడీ చక్రం తిప్పుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే జగన్ ను ఎన్డీయేలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది.
జగన్ ఎన్డీయేలో చేరితో రెండు మంత్రి పదవులను ఇచ్చేందుకు మోడీ రెడీగా ఉండడంతోపాటు.. ఆర్థికేతర హామీలను సైతం నెరవేర్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. అయితే.. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు జగన్ తటపటాయిస్తున్నారు. ఎందుకంటే.. హోదా ఇవ్వలేదు. పోలవరం నిధులు ఇవ్వడం లేదు. అదే సమయంలో తమ కోరికలను ఏదీ కూడా కేంద్రం నెరవేర్చలేదు. దీంతో ఇప్పుడు కనుక ఆయన ఎన్డీయేలో చేరితే రాష్ట్రంలో విపక్షాలకు మరిన్ని ఆయుధాలు ఇచ్చినట్టు అవుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates