మోడీజీ.. అక్క‌డ ఓట‌మిని ముందుగానే ఊహించుకున్నారా?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి.. అతి పెద్ద రాష్ట్రం ఉత్త‌రప్ర‌దేశ్‌లో బీజేపీ ఓట‌మిని నాయ‌కులు ముందుగానే ఊహించే సుకున్నారా? ఈ క్ర‌మంలోనే కాయ‌క‌ల్ప చికిత్స‌కు సిద్ధ‌మ‌వుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఏడాది లో యూపీ స‌హా ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వీటిలో రెండు అతి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అత్యంత కీల‌కంగా మారింది. మ‌రో రాష్ట్రం పంజాబ్‌. ఇది ఎలాగూ ద‌క్క‌ద‌ని బీజేపీ ముందుగానే నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. కానీ, యూపీలోనూ ఇప్పుడు ఇలాంటి సూచ‌న‌లే వ‌స్తుండ‌డంతో ముందుగానే అలెర్ట్ అయింద‌ని అంటున్నారు జాతీయ రాజ‌కీయ విశ్లేష‌కులు.

కేంద్రంలో న‌రేంద్ర మోడీ స‌ర్కారు ముచ్చ‌ట‌గా మూడో సారి అధికారంలోకి రావాలంటే.. యూపీ వంటి పెద్ద రాష్ట్రాల మ‌ద్ద‌తు ఖ‌చ్చితంగా అవ‌స‌రం. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో యూపీలో సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ దూకుడు బీజేపీ నేత‌ల‌కే మింగుడు ప‌డ‌డం లేదు. కొన్నాళ్ల కింద‌ట సంఘ విద్రోహ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ.. తుపాకీతో రాజ్య‌మేలేని దుస్థితి ఇప్ప‌టికీ.. క‌థ‌లు క‌థ‌లుగా ప్ర‌జ‌ల క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది. అదేస‌మ‌యంలో అత్యాచార కేసుల్లోనూ రాష్ట్రం ముందుంది. ఉపాధి మృగ్య‌మైంది. ఇక‌, క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లు ఎంత త‌క్కువ చెప్పుకొంటే అంత మంచిది.

దీంతో యోగి స‌ర్కారుపై తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంద‌న్న‌ది వాస్త‌వం. అయితే.. దీనిని అంగీక‌రించేందుకు బీజేపీ నేత‌లు సిద్ధంగా లేరు. కానీ, లోలోన మాత్రం మ‌థ‌న ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికిప్పుడు త‌క్ష‌ణ‌ చ‌ర్య‌గా.. యూపీకి ప్రాధాన్యం పెంచాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు జాతీయ స్థాయిలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే కేంద్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో యూపీకి మెజారిటీ ప‌ద‌వులు ఇచ్చి.. ఇక్క‌డ బూస్ట‌ప్ చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. అందులోనూ కీల‌క యువ నేత‌ల‌ను రంగంలోకి దింపి… పార్టీపై వ్య‌తిరేకత లేకుండా చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

తాజాగా వ‌స్తున్న క‌థ‌నాల ప్ర‌కారం యూపీ నుంచి 8 మందిని మంత్రులుగా తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. మోడీ స‌ర్కారు రెండు విడ‌త‌ల్లోనూ ఇంత పెద్ద ఎత్తున ఒకే రాష్ట్రం నుంచి మంత్రుల‌ను తీసుకున్న ప‌రిస్థితి లేదు. కానీ, ఇప్పుడు యూపీ ఉన్న ప‌రిస్థితిలో ఇది త‌ప్ప‌డం లేద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. రాష్ట్రానికి ఈ మాత్రం ప‌ద‌వులు ఇవ్వాల్సిందేన‌ని బీజేపీ కీల‌క నేత‌లు సైతం అంగీక‌రిస్తున్నారు. ఆదిలో యోగికి ఇచ్చిన స్వేచ్ఛ బీజేపీకి శాపంగా ప‌రిణ‌మించింద‌నే వ్యాఖ్య‌లు కూడా చేస్తున్నారు. మ‌రి ఈ ప్ర‌యోగం మోడీ కి క‌లిసి వ‌స్తుందా? లేదా? చూడాలి.