ప్రతి శనివారం రాత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్లో.. మరుసటి రోజు ఉదయం ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చే ‘కొత్త పలుకు’ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సమకాలీన రాజకీయాలపై విశ్లేషణతో ఈ వ్యాసం రాస్తుంటారు. అందులో అంశాలు సంచలనాత్మకంగా ఉండేలా చూసుకుంటారాయన. బడా రాజకీయ నాయకులకు సంబంధించి లోగుట్టులన్నీ తనకు బాగా తెలిసినట్లుగా ఆయన ఇందులో వ్యాఖ్యానాలు చేస్తుంటారు.
ముఖ్యంగా తనకు బద్ధ శత్రుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ప్రతి వారం ఏదో ఒక సంచలన విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తుంటారు ఆర్కే. అందులో కొన్ని వాస్తవికంగా అనిపిస్తాయి.. కొన్ని అతిశయోక్తుల్లా కనిపిస్తాయి. ఈ వారం కొంచెం అతిగా అనిపించడమే కాక.. అందరూ నోరెళ్లబెట్టేలా ఆయన కొన్ని విషయాలను ప్రస్తావించారు.
వైఎస్ జగన్ క్రిస్టియన్ అని, ఏసు ప్రభువును కొలుస్తారని అందరికీ తెలుసు. ఐతే జగన్ ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటలకు జీసస్‌తో మాట్లాడతానని అందరితో చెప్పుకుంటారంటూ జగన్ ఈ వారం ‘కొత్త పలుకు’లో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్కే.
గత ఏడాది కరోనా వచ్చిన కొత్తలో అధికారులు వైరస్ ముప్పు గురించి ఆందోళన వ్యక్తం చేస్తే.. జగన్ తేలిగ్గా కొట్టిపారేశారని.. తాను అర్ధరాత్రి జీసస్‌తో మాట్లాడానని.. వైరస్ లాంటిదేమీ ఉండదంటూ తేలిగ్గా కొట్టిపారేశారని.. దీంతో అధికారులకు ఏం మాట్లాడాలో పాలుపోలేదని ఆర్కే పేర్కొన్నారు. అలాగే గతంలో ఒక మాజీ ఐఏఎస్ అధికారి పదవీ విరమణ తర్వాత వైకాపాలో చేరుదామని జగన్‌ను కలిశారని.. ఐతే తాను తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో రోజూ రాత్రి పూట మాట్లాడతానని జగన్ తన దగ్గర అనడంతో సదరు అధికారి అయోమయానికి గురై ఆ పార్టీలో చేరకుండా ఆగిపోయారని ఆర్కే అన్నారు. జగన్ మానసిక జబ్బుతో బాధపడుతున్నాడన్న తరహాలో ఆర్కే ఈ వారం ‘కొత్తపలుకు’ రాశారు. ఐతే దీనిపై జగన్ మద్దతుదారులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండగా.. ఆయన ప్రత్యర్థులు సంబంధిత కామెంట్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.