జ‌గ‌న‌న్న మ‌రో వివాదాస్ప‌ద నిర్ణ‌యం..

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రో వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీపీఎస్సీలో ఇప్ప‌టికే ఇంట‌ర్వ్యూల‌పై జ‌రుగుతున్న ఉద్య‌మాలు, నిర‌స‌న‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండా.. సీఎం జ‌గ‌న్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం విద్యార్థుల‌ను, విద్యార్థి సంఘాల‌ను మ‌రింత రెచ్చ‌గొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఏపీపీపీఎస్సీలో గ్రూప్-1, గ్రూప్-2 స‌హా అన్ని ప్ర‌భుత్వ నియామ‌కాల‌కు సంబంధించి ఇంట‌ర్వ్యూల‌ను ర‌ద్దు చేస్తూ.. ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

వాస్త‌వానికి ఇప్ప‌టికే గ్రూప్‌-1 ప్ర‌ధాన ప‌రీక్ష‌కు సంబంధించిన మూల్యాంక‌నంపై విద్యార్థులు ఉద్య‌మిస్తున్నారు. దీనిని ర‌ద్దు చేయాల‌ని.. వారు డిమాండ్ చేస్తున్నారు. మ‌రోవైపు హైకోర్టు కూడా ప్ర‌ధాన ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌, మూల్యాంక‌నం వంటి విష‌యాల‌పై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ.. ఇటీవ‌లే ఇంట‌ర్వ్యూల‌పై స్టే విధించింది. అయితే.. ప్ర‌భుత్వం మాత్రం త‌న పంతాన్ని నెగ్గించుకునేలా.. ఇప్పుడు ఏకంగా.. ఇంట‌ర్వ్యూల‌నే ర‌ద్దు చేస్తూ.. నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

అన్ని ఉద్యోగాల‌కూ ఇంట‌ర్వ్యూలు వ‌ద్ద‌ని గ‌తంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అయితే.. దీనిని ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయ‌కుండా.. ఇప్పుడు స‌డెన్‌గా తెర‌మీదికి తెచ్చి.. గ్రూప్ – 1 విష‌యంలో తాము అనుకున్న‌ది సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. అస‌లు మూల్యాక‌నం(పేప‌ర్లు దిద్ద‌డం)లోనే డిజిట‌ల్ విధానాన్ని వినియోగించ‌డంపై అభ్య‌ర్థులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టిన ప్ర‌భుత్వం హైకోర్టు స్టే కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. తాజాగా అస‌లు ఇంట‌ర్వ్యూల‌నే ర‌ద్దు చేస్తూ.. నిర్ణ‌యం తీసుకోవ‌డం మ‌రో వివాదానికి అవ‌కాశం ఇచ్చిన‌ట్టేన‌ని అంటున్నారు అభ్య‌ర్థులు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం నుంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌గానే అభ్య‌ర్థులు నిప్పులు చెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.