ప్రపంచంలో అత్యంత దానకర్ణుడు బిల్ గేట్స్ కానే కాదు.. మన టాటా

నలుగురికి సాయం చేయాలనే గుణం మంచిదే. అంతేకాదు.. దానం గుట్టుగా ఉండాలనుకోవటంలో మనోళ్లు ముందుంటారు. కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలీదన్నట్లుగా దానాలు.. దాతృత్వ కార్యక్రమాలు చేపట్టేటోళ్లు బోలెడంత మంది కనిపిస్తారు. అలాంటి వారు అమెరికన్లో.. యూరోపియన్లో అన్న భావన కలుగుతుంది. అంత దాకా ఎందుకు? ప్రపంచంలో దాతృత్వ కార్యక్రమాలు చేపట్టే వారిలో ప్రముఖుడు ఎవరు? ఎవరు ముందుంటారు అన్నంతనే మైక్రోసాఫ్ట్ వ్యవస్థపాకుడు బిల్ గేట్స్ పేరు టక్కున గుర్తుకు వస్తుంది. ఒకవేళ అదే మీ ఆన్సర్ అయితే.. మీరు తప్పులో కాలేసినట్లే.

గడిచిన వందేళ్లలో ప్రపంచంలో అతి పెద్ద దాతృత్వశీలి ఎవరన్న విషయంపై ఒక అధ్యయనం జరిగింది. దీని ఫలితం ఇప్పుడు షాకింగ్ గానూ.. అంతకు మించిన సర్ ప్రైజింగ్ గా ఉండటం గమనార్హం. ప్రపంచంలో అత్యంత దాతృత్వశీలి మరెవరో కాదు.. భారత పారిశ్రామిక పితామహుడు జెడ్ షెడ్జీ టాటాగా తేలింది. హూరన్.. ఎడెల్ గివ్ ఫౌండేషన్ లు రూపొందించిన టాప్ 50 దాతల జాబితాలో జెమ్ షెడ్జీ పేరు అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు జెమ్ షెడ్జీ చేసిన దానం మన రూపాయిల్లో రూ.7.65 లక్షల కోట్లు (102 బిలియన్ డాలర్లు) గా తేల్చారు.

ఆయన తర్వాతి స్థానంలో బిల్ గేట్స్ నిలిచారు. ఆయన ఇప్పటివరకు 74.6 బిలియన్ డాలర్లతో రెండోస్థానంలో ఉండగా.. 37.4 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్ మూడో స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో జార్జ్ సోరోస్.. 26.8 బిలియన్ డాలర్లతో జాన్ డి రాక్ ఫెల్లర్ లు ఉన్నారు. గడిచిన వందేళ్లలో పెద్ద ఎత్తున దాతృత్వ కార్యక్రమాలు చేపట్టింది అమెరికన్లు.. యూరోపియన్లే అయినప్పటికీ.. ప్రపంచంలో ఎక్కువగా దానం చేసింది మాత్రం జెమ్ షెడ్జీనేనని తేల్చారు. దేశీయంగా చూస్తే టాటా తర్వాత భారతీయుల్లో ఎక్కువగా దానం చేసిన వారిలో విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్ జీ నిలిచారు. టాప్ 50 జాబితాలో టాటా తర్వాత చోటు దక్కించుకున్నది అజీమ్ ప్రేమ్ జీ ఒక్కరే.

టాప్ 50 మందిలో అమెరికన్లు 38 మంది కాగా.. బ్రిటన్ నుంచి ఐదుగురు.. చైనా నుంచి ముగ్గురు ఉన్నారు. జాబితాలోని యాభై మందిలో 37 మంది మరణిస్తే.. 13 మంది మాత్రమే జీవించి ఉన్నారు. ఈ యాభై మంది గడిచిన వందేళ్లలో ప్రపంచానికి దానంగా ఇచ్చిన మొత్తం 832 బిలియన్ డాలర్లుగా లెక్క తేల్చారు.