రాష్ట్రంలో ఇప్పటికీ అనేక నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగడం లేదని ఎమ్మెల్యేలు నెత్తీ నోరూ మొత్తు కుంటున్నారు. అది కూడా అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అయితే.. ఆయా నియోజక వర్గాలకు నిధులు ఇచ్చేందుకు వెనుకాడుతున్న ముఖ్యమంత్రి జగన్.. తన సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందులకు మాత్రం నిధులు పారిస్తున్నారు. ఇప్పటికే గడిచిన రెండేళ్లలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లలో పులివెందుల నియోజకవర్గానికి భారీ ఎత్తున నిధులు కేటాయించారు.
అంతేకాదు సీఎం జగన్ అధికారంలోకి రాగానే.. పులివెందుల అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేసి.. చుట్టు పక్కల ప్రాంతాలను కూడా దీని పరిధిలోకి తీసుకువచ్చారు. అదేవిధంగా సిటీ సెంట్రల్ ఐకానిక్ నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి దీనిని కడప కేంద్రం కడపలో నిర్మించాలని నిపుణుల నుంచి సూచనలు వచ్చినా.. పక్కన పెట్టి తన నియోజకవర్గంలోనే నిర్మించేందుకు గత ఏడాది పట్టుపట్టిన తీరు తీవ్ర విమర్శలకు కారణమైంది. అయినా కూడా జగన్ తన నిర్ణయమే అమలులో పెట్టారు.
ఇక, ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో వరుసగా పులివెందుల అభివృద్దికి భారీ ఎత్తున నిధులు కేటాయించారు. 633 కోట్ల రూపాయలను ఒక్క ఈ నియోజకవర్గానికే కేటాయించడం గమనార్హం. అదే సమయంలో సిటీ సెంట్రల్ ఐకానిక్ నిర్మాణం కోసం గతంలో 57 కోట్ల రూపాయలు విడిగా కేటాయించారు. కానీ, ఇప్పుడు ఈ నిధులను రూ.75 కోట్లకు పెంచుతూ.. తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఒకవైపు కడప జిల్లాలోనే అనేక నియోజకవర్గాలు నిధులు లేక.. మౌలిక సదుపాయాలకు దూరంగా ఉంటే.. ఒక్క తన నియోజకవర్గానికే ఇంతగా నిధులు కేటాయించుకోవడం సమంజసమేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి.