కేసీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారంటున్న బీజేపీ

ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్యాకేజీ విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్యాకేజీ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అవ‌మానించే విధంగా ఉంద‌ని మండిప‌డ్డారు.

తెలంగాణ సీఎం చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని అంకెల గారడీగా పేర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ ప్యాకేజీ ద్వారా ఏ రంగానికి అన్యాయం జరుగుతుందో చెప్పాలని సవాల్ చేశారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి స‌మ‌యంలో అంతా కలిసి కట్టుగా రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భావించిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఐదు సార్లు ముఖ్యమంత్రులతో, మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులు, మీడియా సంస్థలు ప్రతినిధులు, ఆర్థికవేత్తలతో.. వివిధ దేశాల ప్రముఖులతో మాట్లాడిన అనంత‌రం ఈ ప్యాకేజీని ప్ర‌క‌టించార‌ని తెలిపారు.

కేంద్ర ప్యాకేజీపై కేసీఆర్ మాటలు, ఉపయోగించిన మాటలు పూర్తిగా అభ్యంతకరంగా ఉన్నాయన్న ఆయన.. నిజాం నిరంకుశ రాజు వలే ప్రవర్తిస్తూ అసందర్భంగా అసహనంగా మాట్లాడడం దురదృష్టకరం అన్నారు. తెలంగాణ సమాజం ఆయన భాషను హర్షించదు అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ లో తెలంగాణ పేద ప్రజలకు లబ్ది చేకూరదా? సీఎం కేసీఆర్ చెప్పాలి అని సవాల్ చేశారు.

ఎఫ్‌ఆర్‌బీఎం సంస్కరణల్లో తప్పేంటో చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. “మాకు డబ్బు ఇవ్వండి, మేమే ఖర్చు పెడతాం! మీరెవరు ఖర్చు పెట్టడానికి అని కేసీఆర్‌ అడుగుతున్నారు..? మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు” అని కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న‌కే తిప్పికొట్టారు. కేసీఆర్‌ మాట్లాడితే ఒక రూల్.. కేంద్రం మాట్లాడితే మ‌రో రూల్ ఉంటుందా అని కిష‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు.

గ్రామ పంచాయతీల్లో తప్పు చేస్తే వేటు తప్పదని మీరు చెప్ప‌లేదా? పంటల విధానంలో మార్పులు తెస్తున్నాం…ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు పథకం వర్తిస్తుంది అని చెప్ప‌లేదా? అలా మీరు ఆదేశాలు వెలువ‌రించ‌డం కరెక్ట్ అయినప్పుడు కేంద్రం నిబంధ‌న‌లు విధించ‌డం ఎందుకు కరెక్ట్ కాదు? ఎందుకు ఈ రెండు నాలుకల ధోరణి?“ అని ప్ర‌శ్నించారు.