ఏపీలో గత 2019 ఎన్నికల్లో ఒంటరి గా పోటీ చేసిన(అంటే.. బీఎస్పీ.. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పటికీ) జనసేన పార్టీ.. అనూహ్యంగా ఆరు మాసాలు తిరగకముందే.. కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిసి.. ఆపార్టీతో పొత్తు పెట్టుకుంది. కలిసి పనిచేస్తామని.. వచ్చే ఎన్నికల్లో జగన్ను మట్టికరిపించడమే ధ్యేయంగా పనిచేస్తామని.. ప్రతిజ్ఞలు కూడా చేసింది. ఈ క్రమంలోనే రాజధాని ఉద్యమం సమయంలో అప్పటి బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో కలిసి జనసేనాని పవన్ కూడా పాల్గొని… ఈ బంధం దృఢమైందని చెప్పకనే చెప్పారు. ఇక, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలోనూ ఆయన ఒకరోజు పర్యటన చేసి.. బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు ప్రచారం చేశారు. రత్నప్రభ పవన్ను తమ్ముడు తమ్ముడు అంటూ వేదిక మీదే రాఖీ కట్టి నానా హడావిడి చేశారు.
కట్ చేస్తే.. ఆ తర్వాత.. ఎక్కడా బీజేపీ – సేనలు కలిసి పనిచేస్తున్న దాఖలా కనిపించడం లేదు. మరి పొత్తు వద్దనుకుంటున్నారా ? లేక.. ఒంటరిగా ఉండడమే బెటర్ అనుకుంటున్నారా ? అనేది ఇరు పార్టీల మధ్య ఊగిసలాటగా ఉంది. ఒకరిద్దరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి.. జనసేనే తమతో పొత్తును వద్దనుకుంటోందని వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జనసేన నుంచి ఈ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందనా ఉండడం లేదు. పార్టీ అధినేత.. హైదరాబాద్ లేదా విదేశాలకు పరిమితం కావడంతో అసలు .. ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోంది ? అనేది సందేహానికి తావిస్తోంది.
పవన్ ఇటీవల సైలెంట్ అవ్వడంతో పాటు వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఆయన డైలీ బిజీ..! ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తే.. రాష్ట్రంలోని జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ ఒంటరిగానే ఉద్యమాలకు రెడీ అయింది. ఇటీవలే పన్నుల పెంపునకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉద్యమాలు చేశారు. ఈ క్రమంలో ఎక్కడా జనసేన నేతలు పెదవి విప్పలేదు.. కాలు కదపలేదు.
అదేవిధంగా రామతీర్థం వంటి ఘటనలు జరిగినప్పుడు కూడా బీజేపీ మాత్రమే ఒంటరిగా ఉద్యమాలు, యాత్రలకు రెడీ అయింది. జనసేన ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించింది. ఈ పరిణామాలను గమనిస్తే.. బీజేపీనే పక్కన పెడుతోందా ? లేక.. బీజేపీ వైఖరి నచ్చక.. అంటే.. తిరుపతి టికెట్ ఇవ్వకపోవడం.. వంటి ఘటనలతో జనసేనే ఆ పార్టీని పక్కన పెడుతోందా ? అనేది చర్చనీయాంశంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates