ఊక‌కు .. ధాన్యానికి తేడా తెలీని బాబు..: కొడాలి

కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్న ఏపీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు కొడాలి శ్రీవేంక‌టేశ్వ‌ర రావు.. ఉర‌ఫ్ నాని..తాజాగా మ‌ళ్లీ రెచ్చిపోయారు. టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్‌పై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి నాని.. సీఎం జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తే.. తాట తీస్తామ‌ని హెచ్చ‌రించారు. రైతుల‌కు పంగ‌నామాలు పెట్టి పారిపోయారంటూ.. చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఊక‌కు-ధాన్యానికి తేడాతెలియ‌ని చంద్ర‌బాబు.. రైతుల గురించి మాట్లాడేందుకు సిగ్గు ఉండాల‌ని అన్నారు.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల‌కు బ‌కాయిలు చెల్లించాలంటూ.. ఇటీవ‌ల చంద్ర‌బాబు.. సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ విష‌యంపై ముచ్చ‌ట‌గా మూడు రోజులు గ‌డిచి పోయిన త‌ర్వాత స్పందించిన కొడాలి.. చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్‌ను రైతు బాంధ‌వుడి తో పోల్చిన ఆయ‌న‌.. చంద్ర‌బాబుతో నీతులు చెప్పించుకునే ప‌రిస్థితిలో తాము లేమ‌ని వ్యాఖ్యానించారు. సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శించే అర్హత బాబు కు లేద‌ని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది బాబు కాదా? అని ప్ర‌శ్నించారు.

అదేస‌మ‌యంలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌ను కూడా మంత్రి వదిలిపెట్ట‌లేదు. లోకేష్ అచ్చోసిన ఆంబోతులా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ప‌ప్పు-తుప్పులు ఏం మాట్లాడినా చెల్లుతుంద‌నుకునే ప‌రిస్థితి లేద‌ని ఘాటుగా వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్ర‌బాబు ఏ విష‌యంపైనైనా సీబీఐ ఎంక్వ‌యిరీ వేశారా? అని ప్ర‌శ్నించారు. 21 రోజుల్లోనే తాము రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డ‌బ్బులు చెల్లిస్తున్నామ‌ని చెప్పారు.

కేంద్రం నుంచి నిధులు రాక‌పోయినా..తాము రాష్ట్ర ఖ‌జానా నుంచి రైతుల‌కు చెల్లిస్తున్నామ‌ని చెప్పారు. రైతులకుఏం చేయాల‌న్నా అది జ‌గ‌న్‌కే సాధ్య‌మ‌ని కొడాలి చెప్పుకొచ్చారు. పిచ్చివాగుడు వాగితే.. లోకేష్‌కు బ‌డిత పూజ త‌ప్ప‌ద‌ని మంత్రి హెచ్చ‌రించ‌డం కొస‌మెరుపు. చంద్ర‌బాబు హ‌యాంలో వైసీపీ నేత‌లు ఎంతోమంది హ‌త్య‌కు గుర‌య్యార‌ని .. వాటికి చంద్ర‌బాబు బాధ్య‌త వ‌హిస్తారా అని నిల‌దీశారు. గ్రామాల్లో జ‌రుగుతున్న వివాదాల‌ను వైసీపీకి ఆపాదిస్తున్నార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు, లోకేష్‌లు నోరు అదుపులో పెట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు.