వరుస ఎదురుదెబ్బలతో కిందా మీదా పడిపోతూ.. చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు..ఆయన పార్టీ నేతలకు కాసింత ఊరట కలిగించే పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాకు చెందిన పార్టీ నేత ఒకరు హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ ఆయనతో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఆ నేత ఎవరు? బాబు ఇంటికి ఎందుకు వెళ్లినట్లు? అన్న విషయాల్లోకి వెళితే..
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన పీసీసీ మాజీ సభ్యుడు కమ్ వైసీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాబు ఇంటికి వెళ్లారు. ఇద్దరు భేటీ అయ్యారు. రాయచోటి నియోజకవర్గంలోన తాజా రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు. పార్టీలో చేరే అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు ఆర్ఆర్ సోదరులతో కలిసి పని చేయటం.. పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అయితే.. రాంప్రసాద్ రెడ్డి బాబును కలవటం ఇదే తొలిసారి కాదు. ఈ మధ్య జరిగిన తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం కోసం శ్రీకాళహస్తికి వెళ్లిన సందర్భంలోనూ వీరిద్దరి భేటీ జరిగింది. స్థానిక రాజకీయ పరిణామాలతోనే ఆయన పార్టీ మారాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. మరి.. వీరిద్దరి భేటీపై వైసీపీ అధినాయకత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates