ఏపీ ముఖ్యమంత్రికి అరుదైన వ్యక్తి నుంచి ప్రశంసలు వచ్చాయి. ఆయన ఎవరో కాదు… జగన్ సీబీఐ కేసులను డీల్ చేసిన అప్పటి సీబీఐ జేడీ… లక్ష్మినారాయణ. జగన్ హామీల అమలులో మాట తప్పడం లేదని జేడీ జగన్ పై ప్రశంసలు కురిపించారు.అంతే కాదు, మరో అరుదైన సందర్భం గురించి వెల్లడించారు జేడీ.
బ్యూరోక్రసీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జేడీ లక్ష్మినారాయణ ప్రస్తుతం క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. జనసేనలో చేరి విశాఖపట్నం నుంచి ఎంపీగా ఓడిపోయిన జేడీ ఆ తర్వాత చాలాకాలం ఆ పార్టీలో యాక్టివ్ గా లేరు. పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత మళ్లీ సినిమాలు చేయడానికి నిర్ణయించడంతో అప్పట్లో పవన్ సినిమాలు చేయడం తనకు నచ్చలేదంటూ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఒక మీడియా సంస్థకు జేడీ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మరోసారి తాను జనసేన నుంచి బయటకు రావడానికి పవన్ సినిమాలు చేయడమే కారణమని చెప్పుకొచ్చారు.
ఇక జగన్ ఏడాది పాలనపై మీ అభిప్రాయం ఏంటి అంటే… ఏడాది అయ్యాక చెబుతాను అన్నారు. అయితే, అక్కడితో ఆపకుండా… జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. ‘జగన్ ఇంకా నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా. కొందరు మేనిఫెస్టోను కేవలం ఎన్నికల్లో విజయం కోసమే అనుకుంటారు. మేనిఫెస్టోలో చెప్పినవి చేయరు. కానీ జగన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఉన్న విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు’ అంటూ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన ఘటన గురించి జేడీ వెల్లడించారు. సీబీఐలో ఉన్నపుడే జగన్ అక్రమాస్తుల కేసు విచారించిన తర్వాత అనంతరం ఒక సారి జగన్ -జేడీ ఒకరికొకరు ఎయిర్ పోర్టులో ఎదురుపడ్డారట. ‘నమస్కారం అంటే నమస్కారం’ ఇద్దరు ఒకరికొకరు నమస్కారం పెట్టుకున్నారట. ఉద్యోగిగా తన బాధ్యత విచారణ, అంతకుమించి వ్యక్తిగతంగా ఆలోచించడానికి ఏముంటుందని జేడీ వ్యాఖ్యానించారు.
నేను పూర్థి స్తాయిలో రాజకీయాలు చేయాలనుకుంటున్నాను. నాకు జనసేనలో కుదరలేదు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలోనూ లేను. గత రెండు వారాల్లోనే తనకు నాలుగు పార్టీలు అంటగట్టారని… సరదాగా వ్యాఖ్యానించారు. కొద్దిరోజుల క్రితం కూడా జేడీ ఓ ఇంటర్వ్యూలో జగన్ విమర్శించడానికి అవకాశం వచ్చిన ప్రయత్నించలేదు. తాజా వ్యాఖ్యలతో జేడీ కొత్త రాజకీయ ఉత్కంఠను రేకెత్తించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates