ఆ ఫొటో క్రెడిట్ కోసం కొట్టేసుకుంటున్నారు

ఒక చిన్న పాప. వలస కార్మికుల కుటుంబానికి చెందిన అమ్మాయి అయ్యుండొచ్చు. రోడ్డు పక్కన జనాలతో కలిసి కూర్చుని ఉంది. ముందు ప్లేట్లో అన్నం, ఇంకా తినుబండారాలేవో పెట్టారు. చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిండి తినే అవకాశం దొరికేసరికి మహదానందానికి గురైనట్లుగా కనిపిస్తోంది.

ఆ పాప ఎంతో స్వచ్ఛంగా నవ్వుతున్న దృశ్యం చూస్తే తన కడుపు నిండుతోందన్న ఆనందం, ఆ తిండి దొరకడానికి ముందు ఆ చిన్నారి ఎంత కష్టపడిందో అన్న దు:ఖం రెండూ ఒకేసారి కలుగుతాయి. ఐతే ఈ ఫొటో తీసింది తెలుగు గడ్డ మీదే. ఐతే దీనికి సంబంధించి క్రెడిట్ తీసుకోవడానికి ఇప్పుడు నెటిజన్లు కొట్టేసుకుంటున్నారు.

హైదరాబాద్ శివార్లలో మేడ్చల్ జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తెలంగాణ ప్రభుత్వం వలస కూలీలకు భోజన సదుపాయం కల్పించిందని.. అక్కడే ఈ చిన్నారి కడుపు నింపుకుంటోందని.. హ్యాట్సాఫ్ కేసీఆర్ అని ఒక వర్గం ట్వీట్లు వేసింది. మరోవైపు దీని క్రెడిట్ కోసం జగన్ అభిమానులు రంగంలోకి దిగారు. ఇది విజయవాడ హైవే దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫుడ్ పాయింట్లో భోజనం చేస్తున్న చిన్నారి ఫొటో అని వాళ్లు క్లైమ్ చేసుకున్నారు.

జగన్‌కు ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తూ వందల కొద్దీ ట్వీట్లు కుమ్మరించేశారు. ఐతే ఈ ఫొటో ఆ చిన్నారి తింటున్న తిండి తెలంగాణ ప్రభుత్వం పెట్టిందీ కాదు. ఏపీ సర్కారు పెట్టిందీ కాదు. ఐతే ఈ ఫొటో తీసింది మాత్రం మేడ్చల్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వద్దే. అసలు ఏపీకి దీంతో ఎలాంటి సంబంధమూ లేదు. కొందరు కుర్రాళ్లు, ఓ స్వచ్ఛంద సంస్థ కలిసి ఏర్పాటు చేసిన శిబిరంలో వలస కార్మికులు భోజనం పెడుతుండగా.. ఆ చిన్నారి అక్కడ ఆనందంగా తిండి తింటున్న సమయంలో తీసిన ఫొటో అట.

మరోవైపు కృష్ణా జిల్లా మాలపాడు దగ్గర ఇలాగే కొందరు కుర్రాళ్లు కలిసి ఫుడ్ పాయింట్ పెట్టి నిరంతరాయంగా భోజనం అందిస్తుండగా.. అక్కడ తీసిన ఫొటోలను కూడా జగన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఏపీ సీఎంకు ఎలివేషన్లు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.