అవును వైసీపీ అధికారిక వెబ్ సైట్లో ఎంపిల జాబితాలో నుండి నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు పేరు మాయమైపోయిందట. లోక్ సభ+రాజ్యసభలో వైసీపీకి 28 మంది ఎంపిల బలముంది. మొన్నటి తిరుపతి ఉపఎన్నికలో గెలిచిన డాక్టర్ గురుమూర్తి పేరును కూడా పార్టీ అప్ డేట్ చేసింది. అయితే ఇదే సమయంలో నరసాపురం ఎంపి రఘురామ పేరు మాయమైపోయింది. ఇందుకు ప్రత్యేకించి కారణం ఇది అని తెలీటంలేదు.
ఒకసారి చరిత్రను గమనిస్తే 2019 ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజులకే రఘురామకు జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు మొదలైన విషయం తెలిసిందే. ముందు పార్టీకి దూరంగా జరిగిన ఎంపి తర్వాత జగన్ కు కూడా దూరమైపోయారు. తర్వాత పార్టీ నేతలతో కలవటం మానేశారు. ఆ తర్వాత పార్టీపైనే కాకుండా ప్రభుత్వంపైన కూడా వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు.
చివరకు ఈ వ్యవహరం ఎంతదాకా వెళ్ళిందంటే డైరెక్టుగా జగన్నే టార్గెట్ చేసేంతవరకు వెళ్ళింది. పరిపాలనలో జగన్ చేస్తున్నతప్పొప్పుల గురించి మాట్లాడటం వరకు ఓకేనే. కానీ జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. దాంతో పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేలా పరిస్ధితులు మారిపోయాయి. ఈ నేపధ్యంలోనే సీఐడీ అధికారులు ఎంపిపై కేసు పెట్టడం తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే.
తనను పార్టీ నుండి సస్పెండ్ చేయించుకోవాలనో లేకపోతే ఎలాగైనా బహిష్కరింప చేసుకోవాలనో ఎంపి తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే పార్టీ పై రెండు ఆప్షన్లు కాకుండా ఏకంగా ఎంపిపై అనర్హత వేటు వేయించేలా పావులు కదుపుతోంది. జగన్ ఢిల్లీ టూర్ మరుసటి రోజే స్పీకర్ ను పార్టీ చీఫ్ విప్ మార్గాని విప్ కలిసి బహిష్కరణ వేటుకు నోటీసిచ్చారు.
బహిష్కరణ లేఖను స్పీకర్ కు అందించిన మరుసటి రోజే పార్టీ అధికారిక వెబ్ సైట్లో ఎంపిల జాబితానుండి రఘురామ పేరును తీసేయటం గమనార్హం. అంటే రఘురామ విషయంలో ఢిల్లీలో ఏదో జరుగుతోందనే సంకేతాలు అందుతున్నట్లే అనుమానించాల్సొస్తోంది. ఇదే విషయమై రఘురామ మాట్లాడుతు తనను పార్టీ నుండి బహిష్కరించారా అనే అనుమానాన్ని వ్యక్తంచేశారు. మరి ఏమి జరుగుతోందో అన్నది ఆసక్తిగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates