ఈటల ఇలా చేయడం ఇది మూడోసారి..!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాని స్పీకర్ ఆమోదించారు. కాగా.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఈటలకు ఇది మూడోసారి కావడం గమనార్హం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏడేళ్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ నిలిచారు. పదవీకాలాం ఉండగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఇది మూడో సారి కావడం విశేషం.

టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన ఏడాదికి.. ఈటల ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత కేసీఆర్ కి నమ్మునబంటూగా ఉంటూ.. పార్టీలో కీలకంగా వ్యవహరించారు. హైదరాబాద్‌, గజ్వేల్‌ ప్రాంతాల్లో ఉద్యమాల్లో పనిచేస్తున్న ఆయనను స్వంత నియోజకవర్గమైన కమలాపూర్‌కు వెళ్ళి పార్టీ బాధ్యతలను చేపట్టాల్సిందిగా గతంలో కేసీఆర్‌ ఆదేశించారు.

కేసీఆర్ సూచనల మేరకు తన సొంత నియోజకవర్గమైన కమలాపూర్‌కు వచ్చిన ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 2004లో అక్కడి నుంచి పోటీచేసి మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డిని ఓడించి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆ తర్వాత ఉద్యమ అవసరాల కోసం 2008, 2010లో రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు.

ఆ తర్వాత 2009లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగి కమలాపూర్‌ నియోజకవర్గం రద్దయింది. కొత్తగా హుజూరాబాద్‌ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి వరుసగా నాలుగు సార్లు హుజురాబాద్‌ శాసనసభ్యుడిగా గెలుపొందారు.

వరుసగా ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన రికార్డును సాధించిన ఈటల రాజేందర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్‌ మంత్రివర్గంలో ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో కేసీఆర్‌ రెండో మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.