వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పై అనర్హత వేటు వేయాల్సిందిగా వైకాపా చీఫ్ విప్ మార్గాని భరత్ శుక్రవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలు సమర్పించామని భరత్ లోక్‌సభ స్పీకర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజుపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం వెంటనే అనర్హత వేటు వేయాలని ఎంపీ భరత్ స్పీకర్‌కు విన్నవించుకున్నారు.
కాగా.. దీనిపై రఘురామా స్పందించారు. తాను ఏ పార్టీతోనూ జట్టుకట్టలేదని.. అధికార పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని.. అయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లోపాలను మాత్రమే ఎత్తి చూపానని చెప్పారు. తనపై అనర్హత వేటు వేయడం ఎట్టి పరిస్థితులలో సాధ్యం కాదని తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ రాసారు.
“కొంతమంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశా. వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి. నాపై దాడి చేసిన వారి విషయంలో మరోసారి ప్రివిలైజ్ మోషన్ ఇస్తా. నాపై ఈ నెల 10న ఫిర్యాదు చేసి 11న చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. హోంమంత్రి అమిత్షా ని సీఎం జగన్ కలిశాకే ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అనర్హత వేటుపై ఇప్పటికే నాపై నాలుగైదు సార్లు ఫిర్యాదు చేశారు” అని రఘురామ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates