సీఎం జ‌గ‌న్‌కు ఆర్ ఆర్ ఆర్ లేఖ‌.. డిమాండ్ ఏంటంటే

సీఐడీ పోలీసుల అరెస్టు.. త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌నే వాద‌న‌.. కోర్టు బెయిల్ మంజూరు వంటి అనేక అంశాల నేప‌థ్యంలో వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ప్ర‌స్తుతం ఈ లేఖ అంశం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఈ లేఖ‌లో ఎక్క‌డా త‌న‌పై సీఐడీ అధికారుల దౌర్జ‌న్యం కానీ, ప్ర‌భుత్వం ప‌రంగా త‌న‌పై చూపిస్తున్న వివ‌క్ష‌ను కానీ.. ఎంపీ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో సామాజిక పింఛ‌ను దారుల‌కు పెంచుతామ‌న్న పింఛ‌న్ సొమ్ముల‌పై సీఎం జ‌గ‌న్‌ను నిల‌దీస్తూ.. ఎంపీ ర‌ఘురామ లేఖ‌ను సంధించ‌డం గ‌మ‌నార్హం. “గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికారంలోకి వ‌చ్చేందుకు పింఛ‌ను దారుల ఓట్ల‌ను మ‌న పార్టీ వైపు తిప్పుకొనేందుకు మీరు ఎంతో శ్ర‌మించారు. అప్ప‌టి వ‌ర‌కు రూ.2000గా ఉన్న పింఛ‌ను మొత్తాన్ని రూ.3000ల‌కు పెంచుతామ‌ని హామీ ఇచ్చారు” అని ర‌ఘురామ గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు.

అదేస‌మ‌యంలో.. “ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పింఛ‌న్ పెంచి ఉంటే.. ప్ర‌తి ఒక్క‌రికీ రూ.2500 చొప్పున అంది ఉండాల్సింద‌ని.. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పింఛ‌నును కేవ‌లం రూ.250 చొప్పున మాత్ర‌మే పెంచారు. ఇప్ప‌టికైనా పింఛ‌ను దారుల‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోండి. త‌క్ష‌ణమే పింఛ‌న్‌ను రూ.2750 చేయండి. అదేస‌మ‌యంలో ఈ రెండేళ్ల కాలంలో పింఛ‌న్ దారులు న‌ష్ట‌పోయిన‌.. సొమ్మును కూడా క‌లిపి రూ.3000 చొప్పున ఇవ్వండి” అని ర‌ఘురామ లేఖ‌లో డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఈ లేఖపై వైసీపీ వ‌ర్గాలు ఎలా రియాక్ట్ అవుతార‌నే ఆస‌క్తి నెల‌కొంది.