జగన్ అజెండా ఇదేనా ?

జగన్మోహన్ రెడ్డి రెండు మూడు అంశాల అజెండాతోనే ఢిల్లీ పర్యటన ఉండబోతోందని సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవటమే ప్రధాన అజెండా అని తెలుస్తోంది. ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న అంశాలపై క్లారిటి తీసుకోవటానికి లేదా ఇవ్వటానికే జగన్ హోంమంత్రితో భేటీ అవుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

ఇంతకీ అంతటి కీలకమైన అంశాలేమిటంటే మొదటిది పోలవరం సవరించిన అంచనాలపై స్పష్టత. పోలవరం అంచనాల విషయంలో కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల మధ్య చాలా గ్యాప్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం వ్యయం రు. 57 వేల కోట్లను కేంద్రం ఆమోదించాలని రాష్ట్రం పట్టుబడుతోంది. 2013 అంచనాల ప్రకారం రు.20 వేల కోట్లే ఇస్తామని కేంద్రం గట్టిగా చెబుతోంది.

ఇక రెండో అంశం ఏమిటంటే తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు విషయం. ఎంపిపై అనర్హత వేటు వేయాలని జగన్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను దాదాపు ఏడాది క్రితమే నోటీసిచ్చారు. దానిపై ఇంతవరకు అతీగతిలేదు. అఫ్ కోర్స్ ఈ విషయం రాజకీయపరమైన అంశం కాబట్టే నరేంద్రమోడి ఆమోదముద్ర లేకుండా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోరని అందరికీ తెలిసిందే. సో మోడిని ఒప్పించాలంటే నేరుగా జగన్ అయినా కలవాలి లేదంటే అమిత్ షాను అయినా కన్వీన్స్ చేయాలి.

ఇక చివరి అంశం ఏమిటంటే ఎంపి కస్టడీ తర్వాత జరిగిన డెవలప్మెంట్లు. కస్టడీకి ఎందుకు తీసుకోవాల్సొచ్చింది ? కస్టడీలో ఏమి జరిగింది ? తర్వాత ఎంపి ఆరోపణలు, వాస్తవాలేమిటి అనే విషయాలపై తన వాదన వినిపిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సందర్భంగా ఎటూ ఢిల్లీ చేరుకుంటున్నారు కాబట్టి అవకాశాన్నిబట్టి ఇతర కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ఏదేమైనా జగన్ పర్యటన కీలకమైనదనే చెప్పాలి.