రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో పెట్టుకోవడం కొరివితో తల గోక్కున్నట్లే ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి. ఏడాదిగా అదే పనిగా ప్రభుత్వం మీద, వైకాపా నాయకుల మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాడన్న కోపంతో గత నెలలో ఆయన మీద పలు సెక్షన్ల కిందట సీబీ సీఐడీతో కేసులు పెట్టించి అరెస్టు చేయించడం ద్వారా తగిన రీతిలో బుద్ధి చెప్పామని అనుకున్నారు వైకాపా నాయకులు. కానీ దీని వల్ల వైకాపా జరిగిన మేలు కంటే చెడే ఎక్కువ అయింది.
రఘురామను కస్టడీలో పోలీసులు కొట్టినట్లు కోర్టులో తేలడంతో ఇప్పుడు తాము తీసి గోతిలో తామే పడ్డట్లు అయింది. ఆ వ్యవహారం జగన్ సర్కారు మెడకు చుట్టుకునేలా ఉంది. తనమీద జరిగిన దాడి గురించి సహచర ఎంపీలతో పాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం వ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయగలిగాడు రఘురామ.
ఇంతకుముందు కేవలం విమర్శలతో సరిపెడుతూ వచ్చిన రఘురామ.. ఇటీవల పరిణామాలతో చేతల్లోకి దిగి జగన్ సర్కారును మరింతగా ఇబ్బంది పెట్టడానికి పట్టుబడుతున్నట్లే కనిపిస్తోంది. జగన్ బెయిల్ రద్దుకోసం తాను వేసిన కేసును ఆయన మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా రఘురామ జగన్ సర్కారుకు మరో చిక్కు తెచ్చి పెట్టేలాగే కనిపిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టులో జగన్ సర్కారు అవినీతి మీద ఆయన పోరాటానికి రెడీ అయ్యారు. పోలవరంలో అవినీతిపై విచారణ జరపాలంటూ ఆయన ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశారు. ఈ ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి ఆయన ఆధారాలు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. దీని మీద రఘురామ కేసులు కూడా వేసే అవకాశముంది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రం బిల్లుల చెల్లింపులో అనేక కొర్రీలు వేస్తోంది. ఇలాంటి సమయంలో ప్రాజెక్టులో అవినీతి మీద కేసులంటే పనులు మరింత నత్తనడకన సాగి జగన్ సర్కారు ఇబ్బందుల్లో పడటం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates