జ‌గ‌న్ స‌ర్కారుపై బీజేపీ మెరుపు ‘దీక్ష‌’ రీజ‌నేంటి?

ఏపీ బీజేపీ నేత‌లు ఒక్క‌సారిగా జ‌గ‌న్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా.. ఎంపీ నుంచి ఎమ్మెల్సీ వ‌ర‌కు, రాష్ట్ర స్థాయి నేత నుంచి మండ‌ల‌స్థాయి నాయ‌కుడి వ‌ర‌కు సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక్క‌సారిగా మెరుపు స‌మ్మెకు దిగారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఈ దీక్షల ప‌ర్వం.. ఒక్క‌సారిగా బీజేపీలో ఉత్సాహం నింపింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదీ రీజ‌న్‌..
రాష్ట్రంలో జ‌గ‌న్‌ ప్రభుత్వం వచ్చిననాటి నుంచి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర, పంట కొనుగోలు, స్థిరీకరణ నిధి, రైతు భరోసా.. ఇతర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి అన్నదాతలపై, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై.. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు చూపించిన శ్రద్ధ ఇప్పుడు ఏమైందని వారు ప్రశ్నించారు.

జీవీఎల్‌.. క‌న్నా.. స‌హా
ఎంపీ జీవీఎల్ న‌రసింహారావు స‌హా బీజేపీ ఏపీ మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, ప్ర‌స్తుత చీఫ్ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స‌హా అంద‌రూ ఈ మెరుపు దీక్ష‌ల్లో పాల్గొన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రివర్స్లో నడుస్తోందని.. విమర్శించారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్న ప్రభుత్వ తీరును నిరసించారు. పథకాలపేరుతో ప్రజలకు సొమ్ము పంచిపెడుతూ.. ప్రభుత్వం అన్నదాతలను గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

3 వేల కోట్లు ఇస్తామ‌ని.. 500 కోట్లేనా?
పంట‌ల మద్దతు ధర కోసం రూ. 3 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తానని చెప్పి కేవలం రూ. 500 కోట్లు కేటాయించారని సీఎం జ‌గ‌న్‌పై బీజేపీ నేత‌లు విరుచుకుప‌డ్డారు. నీటిపారుదల ప్రాజెక్ట్ లపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పరికరాలను రైతులకు అందించడంలేదని అన్నారు. అన్నదాతలకు రైతు భరోసా కింద రూ. 13,500 ఇస్తామని మాటతప్పారని ఆక్షేపించారు. రైతుల నుంచి కొన్న ధాన్యానికి మూడు నెలలైనా చెల్లింపులు చేయడం లేదని.. చాలా చోట్ల అసలు కొనుగోళ్లు కూడా లేవని ఆరోపించారు

జీవీఎల్ వ్యాఖ్య‌ల సంచ‌ల‌నం
ఎంపీ జీవీఎల్ తొలుత దీక్ష‌ను ప్రారంబించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జ‌గ‌న్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. ప్ర‌బుత్వానికి వ‌స్తున్న నిధుల‌ను వివిధ సంక్షేమ కార్య‌క్ర‌మాల పేరిట ప్ర‌జ‌ల‌కు, పార్టీ నేత‌ల‌కు ప‌ప్పు బెల్లాల మాదిరిగా పంచిపెడుతున్నార‌ని.. ఆ నిధుల్లో కొంచెమైనా.. రైతుల‌కు ఎందుకు కేటాయించ‌డం లేద‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. ఇప్ప‌టికైనా .. రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌లు ల‌భించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.