వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణరాజు.. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఒక్క సీఎం జగన్ మినహా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు పంపారు. దీనిలో ఏపీ సర్కారు తనపై వ్యవహరించిన తీరును రఘురామరాజు వివరించారు. ఒక ఎంపీగా ఉన్న తనపైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆయన.. రాజద్రోహం సెక్షన్ను తొలగించేందుకు ముఖ్యమంత్రులు ముందుకు రావాలని కోరారు.
ముఖ్యమంత్రులకు రాసిన లేఖల్లో.. తన అరెస్ట్, తదనంతర పరిణామాలను వివరించారు. ఏపీ సీఎం జగన్ కు తప్ప అన్ని రాష్ట్రాల సీఎంలకు రఘురామ లేఖలు రాయడం గమనార్హం. పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయాన్ని లేఖలో ఆయన ప్రస్తావించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినందుకే.. కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్ చేయించారని రఘురామకృష్ణరాజు తెలిపారు.
ఈ విషయంపై పార్లమెంట్లో తాను ప్రత్యేకంగా ప్రస్తావించాలని నిర్ణయించుకున్నట్టు రఘురామరాజు తెలిపారు. ఈ క్రమంలో తనకు మద్దతిచ్చేలా ఆయా పార్టీల ఎంపీలకు ముఖ్యమంత్రులు సూచించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో రాజద్రోహం సెక్షన్ను తొలగించేలా అసెంబ్లీల్లో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాలని రఘురామ కోరారు.ఈ సెక్షన్ను దుర్వినియోగం చేస్తున్నారని.. దీనిపై ఇటీవల సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా గమనించాలని రఘురామ ముఖ్యమంత్రులను కోరడం గమనార్హం. ప్రస్తుతం రఘురామ రాసిన లేఖల విషయం సంచలనంగా మారడం గమనార్హం.