‘5జీ’ పై ఎందుకంత ర‌గ‌డ‌.. వాస్త‌వాలు ఏంటి?

కొన్నాళ్ల కింద‌ట శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా వ‌చ్చిన ‘రోబో 2.0’ సినిమా గుర్తుంది క‌దా! సెల్ ఫోన్ ట‌వ‌ర్లు, వాటి నుంచి వ‌చ్చే రేడియేష‌న్ల కార‌ణంగా.. పక్షులు చ‌నిపోతున్నాయ‌ని.. సో.. సెల్ ఫోన్ వినియోగం త‌గ్గించాల‌ని, రేడియేష‌న్ కూడా త‌గ్గించాల‌నే థీమ్‌తో వ‌చ్చిన మూవీ అది. అప్ప‌ట్లో.. అంటే ఆ సినిమా విడుద‌ల‌య్యేనాటికి.. మ‌న దేశంలో 4జీ మాత్ర‌మే వ‌చ్చింది. 4జీ వ‌చ్చిన సంద‌ర్భంలోనే ద‌ర్శ‌కుడు శంక‌ర్ మూవీ తీశారు. అయితే.. అప్ప‌ట్లో కేవ‌లం పక్షుల‌పై మాత్ర‌మే రేడియేష‌న్ ప్ర‌భావం ఉంటుంద‌ని మూవీ చెప్పింది.

వివాదం ఇదీ..

అయితే.. ఇప్పుడు త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానున్న 5జీ(ఫిఫ్త్ జ‌న‌రేష‌న్) టెక్నాల‌జీతో మ‌నుషుల‌పై కూడా ప్ర‌భావం ఉంటుంద‌ని.. పెద్ద ఎత్తున నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప‌శుప‌క్ష్యాదుల‌తోపాటు ప్రాణి కోటిపై 5జీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. దీంతో 5జీ రాక‌పై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు, మాన‌వ హ‌క్కుల ఉద్య‌మ‌కారులు కేంద్రానికి లేఖ‌లు రాస్తున్నాయి. 5జీ వ‌ద్ద‌ని.. వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే..కేంద్రం మాత్రం 5జీ వైపు మొగ్గు చూపుతోంది.

కాయ్ ఏమందంటే..

ఈ విష‌యంలో ఇంకా నిర్ణ‌యం తీసుకోక‌పోయినా.. 5జీ ఫోన్ల త‌యారీకి మాత్రంకేంద్రం ప‌చ్చ‌జెండా ఊప‌డంతో ఇప్పుడు ఇది వివాదంగా మారింది. దీనిపై స్పందించిన‌… సెల్యుల‌ర్ ఆప‌రేట‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) మాత్రం.. 5జీ టెక్నాలజీ ఎవరి ఆరోగ్యం పైనా ప్రభావం చూపదని తెలిపింది. 5జీ టెక్నాలజీ పూర్తి సురక్షితమని చెప్పడానికి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని కాయ్‌ వివరించింది. రాబోయే కాలంలో 5జీ గేమ్‌ ఛేంజర్‌గా మారుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి విస్తృతమైన ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంది.

బ‌డా సంస్థ‌ల మొగ్గు!

రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా వంటి అతి పెద్ద టెలికాం సంస్థలు 5జీ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. భారత ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. తక్కువ రేడియేషన్‌తోనే ఈ సేవలను తీసుకురానున్నాయి. ‘5జీ విషయంలో అంతర్జాతీయంగా ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ రేడియేషన్‌ ప్రమాణాలతో పోలిస్తే పదో వంతు మాత్రమే ఉండేలా భారత్‌ నిబంధనలు విధించింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తున్న ప్రతిసారీ ఇలాంటి అసత్య ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి’ అని కాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్పీ కొచ్చర్‌ అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ హైకోర్టు కొట్టేసినా..

తాజాగా 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్‌ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా వేసిన పిటిషన్‌ను డిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. జుహీ, మరికొందరికి రూ.20లక్షల జరిమానా విధించింది. ఈ సందర్భంగా డిల్లీ కోర్టు తీర్పును ఎస్పీ కొచ్చర్‌ స్వాగతించారు. సామాజిక మాధ్యమాల వేదికగా 5జీ విషయంలో వచ్చే అసత్య సందేశాలను నమ్మొద్దని కొచ్చర్‌ పేర్కొన్నారు. కానీ, ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు మాత్రం త‌మ ఉద్య‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తామ‌ని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు 5జీపై మోడీ స‌ర్కారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది ఆస‌క్తిగా మారింది.