రేవంత్ కే పీసీపీ పీఠం… ఇదే ఆఖ‌రి చాన్స్

గ‌త కొద్దికాలంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ ప‌ద‌వి విషయంలో తుది నిర్ణ‌యం జ‌రిగిపోయిందా? పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో తుది ద‌శ వ‌ర‌కు పేరు వినిపిస్తున్న రేవంత్ రెడ్డి పేరును పార్టీ పెద్ద‌లు ఖ‌రారు చేసేశారా? ఇక ప్ర‌క‌ట‌నే మిగిలిందా? అంటే అవునంటున్నారు ఆ పార్టీకి చెందిన ఢిల్లీ ప‌రిణామాలు గ‌మ‌నిస్తున్న వారు. ఒక‌ట్రెండు రోజుల్లోనే పీసీసీ ర‌థ‌సార‌థి ప్ర‌క‌ట‌న రావ‌చ్చున‌ని చెప్తున్నారు.

తెలంగాణ పీసీసీ ర‌థ‌సార‌థి క‌స‌ర‌త్తు దాదాపు ఆరు నెల‌లుగా సాగుతోంది! పీసీసీ చీఫ్‌‌ ఎంపిక కోసం రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ రాష్ట్రంలో అభిప్రాయ సేకరణ చేప‌ట్టారు. గాంధీభవన్‌‌లో మూడ్రోజులపాటు కసరత్తు చేసి నియర్లు, కోర్ కమిటీ మెంబర్లు, నియోజకవర్గ ఇన్‌‌చార్జిలు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలు స్వీకరించారు. వచ్చిన పేర్లలో కొన్నింటిని హైకమాండ్ కు పంపారు. ఐదారుగురి పేర్లను పెద్దల పరిశీలనకు పంపినట్లు అప్పట్లో ఆయనే చెప్పారు. చివరి వడపోతలో జీవన్ రెడ్డి, రేవంత్‌‌రెడ్డి పేర్లు బలంగా వినిపించాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరికి పదవి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఇదే సమయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రావ‌డం , అక్కడి నుంచి పోటీ చేస్తున్న సీనియర్ నేత జానారెడ్డి.. పీసీసీ ప్రెసిడెంట్ ఎంపికను ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని హైకమాండ్‌‌కు లెటర్ రాయ‌డంతో బ్రేక్ ప‌డింది.

తాజాగా గ‌త నాలుగైదు రోజుల నుంచి రేవంత్ రెడ్డికే పీసీసీ అధ్యక్ష పదవి దక్కుతుందని పార్టీలో ప్రచారం ఊపందుకుంది. దాంతో మరోసారి పార్టీలో నేతల మధ్య విబేధాలు బయటపడుతున్నాయి. రేవంత్‌‌ను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న జగ్గారెడ్డి.. రెండు రోజుల క్రితం తానూ పీసీసీ రేసులో ఉన్నట్లు మీడియాకు తెలిపారు. రేవంత్ నియామకాన్ని వ్యతిరేకించిన త‌న‌కు ఫోన్ లో బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. ఈ వ్యవహారం ఇలా నడస్తుండగానే రేవంత్‌కు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు ఢిల్లీకి ఫోన్లు చేస్తున్నారు. ఈ గొడవతో విసిగిపోయిన కొందరు లీడర్లు.. ఎవరో ఒకరికి పదవి అనౌన్స్ చేసి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని హైకమాండ్‌ను కోరుతున్నారు. అయితే, సోష‌ల్ మీడియాలో మాత్రం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కునే రేవంత్ రెడ్డికే పీసీసీ ప‌ద‌వి అంటూ వైర‌ల్ చేస్తున్నారు. ఏం జ‌రుగుతుందో తెలియాలంటే ఒక‌ట్రెండు రోజులు వేచి చూడాల్సిందే.